ప్రాజెక్టు పునరుద్ధరణకు వడివడిగా అడుగులు
రూ.10వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో కొత్త అలైన్‌మెంట్
తుమ్మిడిహెట్టికి బదులు వార్ధా– వెయిన్ గంగా నదులపై సమాంతర బరాజ్
వార్ధా–వెయిన్‌గంగా బరాజ్ లొకేషన్‌లో జియోఫిజికల్ పరీక్షలు షురూ
బరాజ్ ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదింపులకు రాష్ట్రం ప్రయత్నాలు
148–152 మీటర్ల ఎత్తుతో వేర్వేరు ప్రత్యామ్నాయాలకు అంచనాల తయారీ
మహారాష్ట్ర స్పందన ఆధారంగా ఎత్తుపై తుది నిర్ణయం..ఆ తర్వాతే ప్రాజెక్టుపై ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రతిపాదించిన బరాజ్ ఎత్తు మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. ప్రాజెక్టు పాత అలైన్‌మెంట్‌కు కొన్ని మార్పులతో ప్రీఫీజబిలిటీ నివేదిక (పీఎఫ్‌ఆర్)కు తుదిరూపు కల్పిస్తున్నారు. పాత అలైన్‌మెంట్ ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, దానికి 3 కి.మీ. ఎగువన వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి లొకేషన్‌ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే ఛాప్రాలా వన్యప్రాణుల అభయారణ్యం ప్రభావితం కానుండడం, వరదలు ఉధృతంగా పోటెత్తినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండడం కూడా లొకేషన్ మార్పునకు మరో కారణమని అధికార వర్గాలు తెలిపాయి.
వార్ధా– వెయిన్‌గంగాపై సమాంతర బరాజ్...
కొత్త అలైన్‌మెంట్ ప్రకారం..వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి కొంత ఎగువన రెండు నదులపై లంబకోణంలో సమాంతర బరాజ్ నిర్మించి మధ్యలో కాంక్రీట్ బండ్ (నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్)తో కలిపివేయనున్నారు. రెండు వైపులా ఉండే బరాజ్‌లకు గేట్లు ఉండనుండగా, మధ్యలో ఉండే కాంక్రీట్ బండ్ చెక్ డ్యామ్ తరహాలో పనిచేయనుంది. బరాజ్‌లు నిండినప్పుడు గేట్లు ఎత్తకపోయినా మధ్యలోని కాంక్రీట్ బండ్‌పై నుంచి వరద పొంగిపొర్లనుంది. బరాజ్ ప్రతిపాదిత ప్రదేశంలో తాజాగా జియోఫిజికల్ పరీక్షలను ప్రారంభించారు. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) విభాగ ఇంజనీర్లు శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి బరాజ్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు.
మారిన అలైన్‌మెంట్ ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్ నుంచి నీటిని కాల్వ, సొరంగ మార్గంలో తరలించి సుందిళ్ల బరాజ్‌కు పూర్తిగా గ్రావిటీతో తరలించనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దాదాపు 71.5 కి.మీ.ల పొడవున కాల్వ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది. రూ.1,700 కోట్లు విలువైన పనులు జరిగిన తర్వాత ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. అర్ధంతరంగా వదిలేసిన కాల్వను సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానం చేయడానికి మంచిర్యాల జిల్లాలో నన్నెల నుంచి జైపూర్ వరకు భూగర్భంలో 110 మీటర్ల లోతుల్లో 26 కి.మీ.ల పొడవున సొరంగంతోపాటు మరో 6 కి.మీ.ల కాల్వను నిర్మించాల్సి ఉంటుంది. సొరంగం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుండడంతో భూసేకరణ అవసరం లేదు. కాల్వలకు 160 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.
రూ.10 వేల కోట్లతో ప్రాథమిక అంచనాలు
ప్రాథమిక అంచనాల ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్‌ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు, సొరంగం నిర్మాణానికి రూ.3,700 కోట్లు, మిగిలిన కాల్వ నిర్మాణానికి రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.10,000 కోట్ల వ్యయం కానుంది. బరాజ్, కాల్వల భూసేకరణ వ్యయం దీనికి అదనం. పాత అలైన్‌మెంట్ ప్రకారం ప్యాకేజీ–5 కింద 50 కి.మీ.ల కాల్వతో పాటు పంప్‌హౌస్ నిర్మించాల్సి ఉండగా, నాటి ధరల ప్రకారమే రూ.16 వేల కోట్ల వ్యయం కానుందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త అలైన్‌మెంట్‌తో కాల్వ పొడవు తగ్గడం, పంప్‌హౌస్ నిర్మాణం అవసరం లేకపోవడంతో వ్యయం తగ్గనుందని పేర్కొన్నాయి. పాత అలైన్‌మెంట్ ప్రకారం 50 కి.మీ.ల కాల్వను తవ్వాల్సి ఉండగా, మధ్యలో బొగ్గు గనులు ఉండడంతో అలైన్‌మెంట్ మార్చి సొరంగాన్ని నిర్మించనున్నారు.
బరాజ్ ఎత్తుపై చిక్కులు..
తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే తమ రాష్ట్రంలో ముంపు ఏర్పడుతుందని గతంలో మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. తాజాగా వార్ధా–వెయిన్‌గంగా బరాజ్‌ను సైతం 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే కనీసం 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అప్పుడు ఆశించిన మేర ఆయకట్టుకు సరఫరా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో మళ్లీ సంప్రదింపులు జరిపి ఒప్పించడానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ కోరుతూ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలుత లేఖ రాయగా, అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాసినా, మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
మహారాష్ట్ర అంగీకరించే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లు, 149 మీటర్లు, 150 మీటర్ల, 151 మీటర్లు, 152 మీటర్ల వేర్వేరు ఎత్తులతో బరాజ్ నిర్మాణానికి వేర్వేరు ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్టు 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 1,200 ఎకరాల పట్టాభూములు, ఇతర భూములు కలిపి మొత్తం 3,000 ఎకరాల్లో ముంపు ఏర్పడనుందని అంచనా వేశారు. ఒక వేళ 148–149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాల్సి వస్తే అక్కడి నుంచి నీటిని తరలించే కాల్వను 69 నుంచి 75 మీటర్లకు వెడల్పు పెంచితేనే ఆశించిన ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బరాజ్ ఎత్తును ఖరారు చేసిన తర్వాతే ప్రాజెక్టు స్వరూపం విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


