పురిటి నొప్పులతో నరకం.. కాళ్లు మొక్కుతం కనికరించండన్నా పట్టించుకోలేదు!

New Baby Born Dies After Staff Negligence At Metpally Govt Hospital - Sakshi

‘సారూ..బిడ్డ పురిటినొప్పులతో బాధపడ్తోంది..ఆ గోస సూడలేకపోతున్నం.. బాంచెన్‌.. ఆపరేషన్‌ జేయుండ్రి.. మీ కాళ్లు మొక్కుతం..కనికరం సూపుండ్రి..’అని కాళ్లుపట్టుకుని వేడుకున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. పండంటి బిడ్డ పుట్టబోతుందని ఆశపడ్డ ఆ తల్లికి వైద్యులు సిజేరియన్‌ చేసి చనిపోయిన శిశువును చేతిలో పెట్టడంతో నిరాశ ఎదురైంది.

మెట్‌పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రబోయిన అశోక్‌ భార్య సుజాత(22)కు ఇటీవలే నెలలు నిండాయి. తొలికాన్పు కావడంతో ఈనెల 19న మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే, సాధారణ ప్రసవం కోసం మరుసటిరోజు సాయంత్రం వరకూ వైద్యసిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రసవం కాకపోవడంతో సిజేరియన్‌ చేయాలని, లేదంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు. సిబ్బంది అంగీకరించకపోగా, కుటుంబసభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకూ పురిటినొప్పులతో బాధపడ్తున్న సుజాతకు చివరికి వైద్యులు సిజేరియన్‌ చేశారు. అయితే.. 

అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ సాజిద్‌ను¯ ఆరాతీయగా..సుజాతకు ఈనెల 21న ప్రసవం చేయాల్సి ఉందన్నారు. అప్పటిదాకా సాధారణ ప్రసవం కోసం యత్నించామని తెలిపారు. వీలుకాకపోవడంతో సిజేరియన్‌ చేశామని, మృతశిశువు జన్మించిందని, ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top