Land pooling: భూ సమీకరణకు కొత్త విధానం!

New approach to Land pooling for satellite towns and housing projects  - Sakshi

శాటిలైట్‌ టౌన్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ల్యాండ్‌పూలింగ్‌

మహారాష్ట్ర, గుజరాత్‌లలో అధికారుల అధ్యయనం నివేదికల పరిశీలన

నిపుణులతో సంప్రదింపుల తర్వాత సర్కారు ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది.

ఆ శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్‌లో, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్‌ పూలింగ్‌ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్‌ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి.  

పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. 
భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్‌లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top