వేపచెట్టు మళ్లీ ఎండిపోతోంది

Neem Trees Dying Across Telangana - Sakshi

పది రోజులుగా మాడిపోతున్న కొమ్మలు

గతేడాది ఇదే సమయంలో తీవ్రమైన సమస్య

‘సీజనల్‌ దాడి’గా మారిందంటున్న నిపుణులు

శాంపిళ్లు పరిశీలిస్తున్న వ్యవసాయ వర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌: వేపకు మళ్లీ ఫంగస్‌ సవాల్‌ విసురుతోంది. గతేడాది ఆగస్టు–సెప్టెంబర్‌ మాసా­ల్లో వేపకొమ్మల చివర్లు మాడిపోయి.. చూస్తుండగానే చెట్టు మొత్తం ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడూ సరిగ్గా అదే సమయంలో వేపచెట్ల చివర్లు ఎండిపోవటం మొదలైంది. దీంతో ఈ ఫంగస్‌ సమస్య వేపచెట్ల పాలిట సీజనల్‌ దాడిగా మారనుందనే నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గత వారం పది రోజులుగా నగర శివారుల్లో, శంషాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌ ప్రాంతాల్లో వేపచెట్ల కొమ్మ చివరి భాగాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అయితే గతేడాది స్థాయిలో తీవ్రత లేకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండిపోతున్న తీరు వేగంగా విస్తరిస్తోంది. 

మళ్లీ అదే ఫంగస్‌ వ్యాప్తి?
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా వేపచెట్ల కొమ్మలు ఎండిపోయాయి. వీటిలో 10 శాతం చెట్లు నిలువునా ఎండిపోయాయి. కానీ ఔషధ వృక్షమనే పేరున్న వేపచెట్లు తమను తాము కాపాడుకుని.. ఉగాదికల్లా మళ్లీ చిగురించాయి. మురికినీళ్లు నిరంతరం నిలిచే ప్రాంతాలు, మొదలు వద్ద కాంక్రీట్‌ చేసిన ప్రాంతాల్లోని చెట్లు మాత్రం ఎండిపోయాయి. వేపను సాధారణంగా ఆశించే టిమస్కిటో బగ్‌ అనే పురుగు కాటువేయటం, ఆ  ప్రాంతం నుంచి ‘పోమోస్సిస్‌ అజాడిరెక్టే’ అనే ఫంగస్‌ లోపలికి ప్రవేశించి చెట్లు ఎండిపోయేలా చేసినట్టు నిపుణులు గుర్తించారు.

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో నిపుణులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన వేపకొమ్మలు తెచ్చి పరిశోధించారు. వివిధ పరీక్షల్లో పోమోప్సిస్‌ అజాడిరెక్టే ప్రభావం చాలా ఎక్కువుందని, ప్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు సోకాయని తేలింది. వీటి నివారణకు కొన్ని మందులను సూచిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

మళ్లీ పరీక్షలు ప్రారంభం
ఇప్పుడు మళ్లీ వేపకొమ్మలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు శంషాబాద్‌ సమీపంలోని కొన్ని చెట్ల నమూనాలను సేకరించి కల్చర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన మిగతా ప్రాంతాల నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నామని పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్‌ సాక్షితో చెప్పారు. ‘వాతావరణంలో ఫంగస్‌లు కలిసిపోయినప్పుడు తదుపరి సంవత్సరాల్లోనూ అవి మళ్లీ ప్రభావం చూపుతాయి. కొన్నిచోట్ల చె­ట్లు ఎండిపోవటానికి ఇదే కారణం కావచ్చు. ఈ నెలలో సమస్య విస్తరిస్తే, ఈసారీ ఫంగస్‌ ప్రభా­వం ఉన్నట్టేనని భావించాల’ని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top