జేఈఈ పరీక్ష కేంద్రాల కుదింపు

National Testing Agency Has Shortened JEE Mains Exam Centers - Sakshi

రాష్ట్రంలో నాలుగు సెంటర్ల ఎత్తివేత 

దూర ప్రాంత విద్యార్థులకు తప్పని తిప్పలు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 24 నుంచి జరిగే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షను ఈసారి 17 పట్టణాలకే పరిమితం చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతికదూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈసారి ఆ తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కోవిడ్‌ కాలంలో నాలుగు దఫాలుగా నిర్వహించిన పరీక్షను ఈసారి రెండు దఫాలకు తగ్గించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థుల వెసులుబాటు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రామాణికంగా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

అయితే పరీక్ష కేంద్రాల తగ్గింపు వల్ల పలు జిల్లాల్లో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌లో పరీక్ష రాసే విద్యార్థులు నిజామాబాద్‌కుగానీ, హైదరా బాద్‌కుగానీ వెళ్లాల్సి ఉంటుంది. వికారాబాద్‌ అభ్యర్థులు హైదరాబాద్‌లోగానీ, సంగారెడ్డిలోగా నీ రాయాల్సి ఉంటుంది. గద్వాల విద్యార్థులు మహబూబ్‌నగర్‌ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు 95 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, మంచిర్యాలలో ఉన్న కేంద్రాలను ఈసారి తీసేశారు.  

పరీక్ష కేంద్రాలు ఇవే. 
జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ ఉన్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top