కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జునసాగర్‌ | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జునసాగర్‌

Published Tue, Jan 9 2024 6:12 AM

Nagarjuna sagar under control of Krishna Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తాత్కా లికంగా తన అధీనంలోకి తీసుకుంది. సోమవారం బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్‌లోని గేట్లు 5,7వ నంబర్‌ గేట్లను ఎత్తి.. ఏపీకి నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రంతా 1000 క్యూసెక్కులు, మంగళవారం ఉదయం నుంచి రోజుకు 4–5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.03 టీఎంసీలను సాగర్‌ కుడి కాలువ ద్వారా ఏపీ తాగు నీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.03 టీఎంసీల నీళ్లు విడుదల పూర్తి కాగానే మళ్లీ గేట్లను కృష్ణా బోర్డు యంత్రాంగమే మూసి వేయనుంది.

తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో..
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డ్యాం నిర్వ హణ ఏపీ, సాగర్‌ డ్యామ్‌ నిర్వహణను  తెలంగాణ చూసింది. గత నవంబర్‌ 29వ తేదీన భారీ బలగా లతో సాగర్‌ డ్యామ్‌లో ఏపీ వైపు ఉన్న గేట్లను, డ్యామ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసు కున్న విషయం విదితమే. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాతో పాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పలు దఫాలుగా సమావేశమయ్యారు. నవంబర్‌ 29వ తేదీకి ముందున్న పరిస్థితిని నెలకొల్పాలని తెలంగాణ కోరుతూ వస్తోంది. అయితే ఏపీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సాగర్‌ డ్యామ్‌ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించారు.

సాగర్‌ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీకి విడుదల చేయడానికి అనుమతిస్తూ ఈనెల 5న కృష్ణాబోర్డు వాటర్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ 1.07 టీఎంసీలను సొంతంగా తరలించుకుంది. మిగిలిన నీళ్లను సైతం ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ విడుదల చేసుకునేందుకు ప్రయత్నించగా, సాగర్‌ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు అడ్డుకున్నట్టు సమాచారం. 

కృష్ణాబోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఫిర్యాదు
మరోవైపు ఏపీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్‌) సి.మురళీధర్, నాగార్జునసాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌ కుమార్‌లిద్దరూ కృష్ణాబోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ కలిసి ఫిర్యాదు చేశారు. పునర్విభజన చట్ట ప్రకారం నీటిని విడుదల చేసే అధికారం తమకే ఉందని, ఒకవేళ కుదరకపోతే కృష్ణాబోర్డు మాత్రమే నీటిని విడుదల చేయాలని మురళీధర్‌ స్పష్టం చేశారు.

ఏపీ నీటిని విడుదల చేస్తే... ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. దాంతో హుటాహుటిన కృష్ణాబోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌..బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్‌ గుప్తా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్యలను సాగర్‌కు పంపించారు. ఇండెంట్‌ ప్రకారం ఏపీకి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.

నేడు ప్రత్యేక సమావేశం
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పరిస్థితిపై చర్చించడానికి వీలుగా ఈనెల 9వ (మంగళవారం) తేదీన కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. వివాదాల్లేకుండా బోర్డు చేతుల్లోకి సాగర్, శ్రీశైలం డ్యామ్‌లు అందించాలని బోర్డు కోరే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండా ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ వాదించే వీలుంది.  

 
Advertisement
 
Advertisement