నేడు మృగశిర కార్తె  | mrigasira karthi 2024 | Sakshi
Sakshi News home page

నేడు మృగశిర కార్తె  

Jun 8 2024 1:11 PM | Updated on Jun 8 2024 1:11 PM

mrigasira karthi 2024

ఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె అనగానే తొలుత గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెతో వేసవి కాలం దాదాపు ముగిసి వర్షాకాలం మొదలైందని భావిస్తారు. ఈ నేపథ్యాన కార్తె మొదటి రోజు చేపలు తింటే మంచిదని నమ్ముతారు. ఇదేరోజు ఉబ్బసం, ఆయాసంతో బాధపడుతున్న వారికి హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు ఇవ్వడం అందరికీ తెలిసిందే. 

ఇక ఈరోజు చేపలు తింటే వేసవిలో ఉష్ణోగ్రతతో శరీరంలో పెరిగే వేడి దూరమవుతుందని చెబుతారు. ఇలా కారణాలు ఏమైనా మృగశిర ఆరంభం రోజున చేపలు తినడానికి  జనం ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు కూడా జోరుగా సాగనున్నాయి. ఈ మేరకు జిల్లాలో దాదాపు 100 టన్నులకు పైగా చేపల అమ్మకం సాగనున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే సుమారు 40 నుంచి 50 టన్నుల చేపలు అమ్ముడవుతాయని విక్రయదారులు చెబుతున్నారు. 

సరిపడా లభ్యత లేక.. 
మృగశిర కార్తె రోజున ప్రజలు చేపలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుండగా ఆ స్థాయిలో లభ్యత లేదు. దీంతో విక్రయదారులు, మత్స్యకారులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలను శుక్రవారం సాయంత్రానికి దిగుమతి చేసుకున్నారు. ఆయా జిల్లాలో ఉన్న చేపల చెరువుల నుంచి టన్నుల కొద్ది చేపలను తెప్పించి.. అమ్మకానికి సిద్ధం చేశారు. 

రకాల ఆధారంగా డిమాండ్‌ 
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు డిమాండ్‌ పెరిగింది. శనివారం మృగశిర అయినప్పటికీ లభ్యత, ధర ఎలా ఉంటాయోనన్న భావనతో పలువురు శుక్రవారమే కొనుగోలుకు రాగా విక్రయం ఊపందుకుంది. దీంతో ధరలూ పెరిగాయి. సహజంగా ఇక్కడ అధిక ధర ఉండే కొర్రమేను చేప కిలో రూ.350 నుంచి రూ.500కు చేరింది. ఇక పచ్చి రొయ్యలు కిలో రూ.450 చొప్పున విక్రయిస్తుండగా, బొచ్చలు, రవ్వలు, గ్యాస్‌కట్‌లు, బంగారు తీగలు వంటి రకాలను రూ.200 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు.

మొదటి నుంచి అలవాటు 
మృగశిర కార్తె ఆరంభం రోజున చేపలు తినడం అలవాటు. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేవారు. అందుకే ఏటా ఈ కార్తె రోజున చేపలు తప్పక కొనుగోలు చేస్తాం. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, ఉబ్బసం, ఆయాసం వంటి వ్యాధులు దూరమవుతాయని నమ్మకం. 
–ప్రభాకర్, బురహాన్‌పురం, ఖమ్మం

చేపల విక్రయాలు పెరిగాయి.. 
మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయాలు పెరిగాయి. ఇక్కడ చేపలు సరిపడా లేకపోవడంతో ఏపీ నుంచి తెప్పించాం. చాలామంది ముందురోజే ఆర్డర్‌ చేశారు. ఈసారి కొర్రమేను రకం చేపలకు డిమాండ్‌ ఉంది. ఇతర రకాలు సైతం బాగానే అమ్ముడవుతాయనే నమ్మకంతో దిగుమతి చేసుకున్నాం. 
–రేణుక, చేపల విక్రయదారు, త్రీటౌన్, ఖమ్మం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement