ఎర్రవల్లి కుదరదు.. నందినగర్‌లోనే..
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తాం
కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
ఇంటి గోడకు అతికించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్‌లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
సీఆర్పిసీ సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం ఇచి్చన నోటీసులకు స్పందించిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్‌కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజా నోటీసులు ఇచ్చారు. ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు.
సుదీర్ఘంగా చర్చించి..
కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో..గురువారం ఇచి్చన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. లేదంటే హైదరాబాద్‌లో మీరు చెప్పిన చోటుకే మేము వస్తామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఎంచుకోవాలని కేసీఆర్ కోరారు. విచారణ కోసం ఎర్రవల్లికి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ శుక్రవారం న్యాయ నిపుణులతో భేటీ అయింది.
సుదీర్ఘ మంతనాల తర్వాత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల అఫిడవిట్లు, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల్లో ఉన్న నివాస చిరునామా ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ‘మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, అలాగే సీఆర్‌పీసీ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం, అధికారిక రికార్డుల్లో ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ నిర్వహించేందుకు దర్యాప్తు అధికారి నిర్ణయించారు..’అని వెల్లడించారు మీరు కోరినట్లుగా ఎర్రవల్లిలో విచారించడం కుదరదని చెప్తూ.. అధికారిక రికార్డుల్లో ఉన్న నివాసాన్నే (నందినగర్‌లోని ఇల్లు) విచారణ స్థలంగా నిర్ణయించిన విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.
అదే సమయంలో..‘విచారణ సందర్భంగా అనేక సున్నిత ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డుల పరిశీలన అవసరం. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా హైదరాబాద్ నివాసం (నందినగర్)లో విచారణకు అందుబాటులో ఉండగలరు..’అని సిట్ స్పష్టం చేసింది.
కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ
సీఆర్పిసీలోని సెక్షన్ 160 ప్రకారం జరిగే ఈ విచారణకు సంబంధించి చట్టంలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడి పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలకు చెందిన వాళ్లు ఫలానా ప్రాంతానికి వచ్చి తమ వాంగ్మూలం నమోదు చేసుకోవాలని కోరే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో నోటీసుపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.


