కరోనా టెస్టులు చేసుకుంటేనే అసెంబ్లీకి..! 

Monsoon Session Of Telangana Assembly Likely Held 20 Days - Sakshi

మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా అందరికీ వైద్య పరీక్షలు 

మంత్రుల పీఎస్‌లు, పీఏలకు మాత్రమే సభలోకి అనుమతి 

సభ్యులకు ఆక్సీమీటర్, శానిటైజర్‌తో కూడిన కిట్లు 

కరోనా లక్షణాలుంటే సమావేశాలకు రావద్దు 

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై స్పీకర్, మండలి చైర్మన్‌ 

6 అడుగుల దూరం పాటిస్తూ అదనపు సీట్ల ఏర్పాటు: మంత్రి వేముల

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరయ్యే సభ్యులు, అధికారులు, పోలీసు, మీడియా, ఇతర సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై శుక్రవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి పోచారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఆరు కేటగిరీలకు చెందిన వారు ఈ నెల 6 సాయంత్రంలోగా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు, మార్షల్స్, మీడియా, మంత్రుల పీఎస్‌లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులు చూపిస్తేనే సమావేశాలకు అనుమతిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. 

జ్వరముంటే నో ఎంట్రీ.. 
తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అక్కడి వైద్యులతో కరోనా పరీక్షలు చేయించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు స్పీకర్‌ పోచారం చెప్పారు. మంత్రుల పీఎస్‌లు, పీఏలకు మాత్రమే సభలోకి అనుమతి ఉందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలు, ఇతర వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని వెల్లడించారు. అసెంబ్లీ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజర్‌ యంత్రాలు అందుబాటులో పెడతామన్నారు. జ్వరం ఉన్న వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని.. జలుబు, దగ్గు వంటి ఇతర లక్షణాలున్న వారు కూడా అసెంబ్లీకి రాకూడదని స్పీకర్‌ స్పష్టంచేశారు. మాస్కులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తామని, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద మాస్కులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 

పరిమిత సంఖ్యలో మీడియా పాస్‌లు 
పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే శాసనసభ సమావేశాలు జరుగుతాయని, అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీడియాకు పరిమిత సంఖ్యలో పాస్‌లు జారీ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం తెలిపారు. సందర్శకులకు అనుమతి లేదని, మీడియా పాయింట్, లాబీపాస్‌లు జారీ చేయడం లేదన్నారు. మీడియా సంస్థలకు రెండు చొప్పున పాస్‌లు ఇస్తున్నట్లు వెల్లడిస్తూ, విజిటర్స్‌ గ్యాలరీని కూడా మీడియాకు కేటాయిస్తున్నామని చెప్పారు. చర్చల సమయంలో సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం పిలుపునిచ్చారు. 

అసెంబ్లీ ఆవరణలో మహమూద్‌ అలీకి కరోనా పరీక్షలు చేస్తున్న వైద్యులు 
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. 
కరోనా లక్షణాలున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు దూరంగా ఉండాలని మండలి చైర్మన్‌ గుత్తా సూచించారు. సమావేశాల సం దర్భంగా ధర్నాలు, నిరసనలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసు లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉం డాలని సూచించారు. సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేయడంతో పాటు, పార్లమెంటు మార్గదర్శకాలను పాటి స్తున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల తెలిపారు. ఉభయ సభల్లో భౌతిక దూరం పాటిస్తూ 6 అడుగుల దూరం లో శాసనసభలో అదనంగా 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు వినయ్‌ భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా కిట్లు 
ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్‌తో కూడిన కిట్లను అందజేస్తామని స్పీకర్‌ పోచారం వెల్లడించారు. మున్సిపల్, పబ్లిక్‌ హెల్త్, జీహెచ్‌ఎంసీ ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరాలతో పాటు పరిసరాలను రోజుకు రెండు సార్లు శానిటైజ్‌ చేస్తామని, సభ్యుల కోసం అసెంబ్లీ ఆవరణలో 2 డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని వివరించారు.

సమావేశాలు.. 20 రోజులు 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ ఖరారు చేసింది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల నిర్వహణ తీరు, ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం జరగ్గా... సభలో చర్చకు వచ్చే అంశాల సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాల్సిందిగా వారిని స్పీకర్, చైర్మన్‌ ఆదేశించారు. గతంలో మాదిరిగా అధికారులను గుంపులుగా కాకుండా, శాఖల వారీ ముఖ్యమైన వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. సాయంత్రం పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో భద్రతపరమైన అంశాలు, బందోబస్తుపై చర్చించారు.ఎస్‌పీఎఫ్‌ డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top