
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశం
నల్లగొండ: నీరందక ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. వేసవిలో సాగు, తాగునీరు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కాల్వల కింద పలుచోట్ల నీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. కాల్వల్లో మోటార్లు వేసి కొందరు రైతులు కిలోమీటర్ల కొద్దీ తీసుకుపోతుండటం వల్ల.. కాల్వ చివరి రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. అధికారులు అలాంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్షేత్ర స్థాయికి అధికారులు వెళ్తే.. సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వేసవిలో తాగునీటి తక్షణ సమస్య పరిష్కారానికి.. కలెక్టర్‌ల వద్ద కొంత నిధులు ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేసే విషయమై.. ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో నిధులు అందుబాటులో ఉంచితే.. ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరించవచ్చని సూచించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాల్వల విస్తరణతో పాటు లైనింగ్ పనులు చేస్తేనే చివరి భూములకు నీరందించగలుగుతామని అభిప్రాయపడ్డారు.