ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. బీజేపీపై కేటీఆర్‌ ఆగ్రహం

Minister KTR Condemns BJP Attack On Dharma Reddy Home - Sakshi

తెలంగాణలో చిచ్చు పెట్టేలా బీజేపీ కుటిల ప్రయత్నాలు

మా ఓపిక నశిస్తే, మీరు బయట తిరగలేరు

బీజేపీకి మంత్రి కేటీఆర్‌ హెచ్చరికలు

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండిచారు.  ఈ మేరకు కేటీఆర్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదు. (టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు)

విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నా. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించాం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

కాగా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి వసూలు చేసే చందాలను బీజేపీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోందంటూ ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. రాళ్లుతో ఇంటి పరిసర ప్రాంతాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనను మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top