KTR: అభివృద్ధంటే కురుకురే పంచడం కాదు.. ఆ హక్కు కిషన్‌ రెడ్డికి లేదు

Minister KTR Comments On Union Minister Kishan reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి లేదని చరిత్రలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. నగర అభివృద్ధిపై కిషన్‌రెడ్డి కళ్లుండీ చూడలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.

నగరం నలుమూలలా అద్భుతంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఓర్వలేక, అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ నగరానికి ఒక్కపైసా అదనంగా తేలేని కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమైన అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ప్యాసింజర్‌ లిఫ్ట్‌లను ప్రారంభించడం, కురుకురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కిషన్‌రెడ్డి పనికిమాలిన మాటలు బంద్‌ చేసి హైదరాబాద్‌కు నిధులను తీసుకురావాలని సూచించారు. 

సొంత నియోజకవర్గంలో ఏం చేశావ్‌ కిషన్‌..?  
వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేందని అడగలేని కిషన్‌ ..తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్రమోదీ పాట పాడుతున్నారని మండిపడ్డారు.

సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేంద్రప్రభుత్వ నిధులతో ఏం అభివృద్ధి చేసిండో చెప్పాలని నిలదీశారు. సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ పనులు మూడేళ్ల నుంచి నిదానంగా కొనసాగుతూనే ఉన్నా రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా ఏ మాత్రం చలించని కిషన్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం అజ్ఞానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదని మంత్రి కేటీఆర్‌ గురువారం ఇక్కడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top