పామాయిల్‌ సాగుకు 4.36 లక్షల హెక్టార్లు అనుకూలం 

Minister Kishan Reddy Ridicules TS Claims On Subsidies For Oil Palm Cultivation - Sakshi

తెలంగాణసహా ఇతర రాష్ట్రాలకు రూ.5,170 కోట్ల కేటాయింపులు: కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పామాయిల్‌ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్‌ సాగుకు యోగ్యంగా ఉండగా, అందులో 4.36 లక్షల హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌– ఆయిల్‌పామ్‌ కింద పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాలో ఈ భూమి విస్తరించి ఉందని, పామాయిల్‌ సాగు తెలంగాణ రైతులకు పెద్దఎత్తున లబ్ధిని చేకూరుస్తుందని వెల్లడించారు.

పామాయిల్‌ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019–20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్‌ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్‌ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు.

ఈ పథకం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ. 8,844 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లుగా ఉందని తెలిపారు.  

ఎస్సీ 17, ఎస్టీలకు 8 శాతం చొప్పున లబ్ధి
రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌– ఆయిల్‌పామ్‌ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చటానికి కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీలకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top