కాగితపు జెండాలు అంటించుకోవాలా?: హరీశ్‌ | Sakshi
Sakshi News home page

కాగితపు జెండాలు అంటించుకోవాలా?: హరీశ్‌

Published Thu, Aug 11 2022 2:20 AM

Minister Harish Rao Fires On Centre Not In Position To Distribute National Flags - Sakshi

సాక్షి, సిద్దిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండాలతో వజ్రోత్సవాలు చేసుకోవాలని మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నా యని విమర్శించారు. ఇదేనా వజ్రోత్సవాలు జరిపే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ మండిపడ్డారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సిద్దిపేట శివారు రంగనాయకసాగర్‌ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును హరీశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ ప్రభుత్వం 1.20 కోట్ల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేకిన్‌ తెలంగాణ పేరిట జాతీయ జెండాలను తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నామన్నారు.

మహా త్మాగాంధీని అవమానపరుస్తూ.. గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భావి భారత పౌరులకు దేశభక్తిని పెంపొందించేలా, దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను 570 సినిమా టాకీసుల్లో ప్రదర్శిస్తున్నామని హరీశ్‌ చెప్పారు. కాగా, ఫ్రీడమ్‌ పార్క్‌లో వజ్రోత్సవాల్లో భాగంగా 75 అని మొక్కలతో ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement
Advertisement