
భారత్ తోడ్పాటును తుర్కియే గుర్తు చేసుకోవాలి
ఇక్కడ ముస్లింలు గౌరవప్రదంగా జీవిస్తున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తుర్కియే దేశానికి విజ్ఞప్తి చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాక్ కంటే భారత్‌లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్‌లోనూ గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవొద్దని వ్యాఖ్యానించారు.
తుర్కియే, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తుర్కియే అభివృద్ధికి భారత్ తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు. పాక్ వైపు మొగ్గుచూపుతున్న తుర్కియే తమ విధానాన్ని పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపైనా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ‘నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిని పాకిస్తానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నాలాంటి వారు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే వారికి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది’ అని అన్నారు.
మానవాళికి ముప్పు పాక్..
పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఒవైసీ కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్తానీ మిలిటరీ భారత్‌లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్నీ ఆయన విమర్శించారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ, చైర్‌పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు.