జగిత్యాల జిల్లా: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో భాగంగా టీచర్ల పనితీరు విషయంలో రిమార్క్‌లు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీ పీఓ దారోజు పద్మ ఏసీబీకి చిక్కారు. రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ మధు కథనం ప్రకా రం.. మెట్‌పల్లిలో 21 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
తనిఖీల సమయంలో రిమార్క్‌లు నమోదు చేయకుండా ఉండడానికి ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని సీడీపీఓ ఆయా కేంద్రాల టీచర్లను డిమాండ్ చేశారు. మూడు నెలలకు సంబంధించి తనకు మొత్తం రూ.63 వేలు చెల్లించాలని కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమెపై పలువురు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మెట్‌పల్లికి వచ్చి కార్యాలయ ఆవరణలో ఫిర్యాదుదారు నుంచి సీడీపీఓ ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


