మావోయిస్టు హరిభూషణ్‌ ఇంట విషాదం..

Maoist Telangana Secretary Haribhushan Wife Passed Away - Sakshi

మహబూబాబాద్‌: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు తెలిసింది. హరిభూషణ్‌ చనిపోయిన నాలుగు రోజులకే ఆయన భార్య కూడా మరణించడంతో హరిభూషణ్‌, సమ్మక్క పుట్టిన ఊరు గంగారాంలలో విషాదం అలముకుంది.

హరిభూషణ్‌ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. కరోనాతో ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా హరిభూషణ్‌ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే.  

ఇదేనా పార్టీ ఇచ్చిన గౌరవం?
కొత్తగూడ: పార్టీ కోసం కుటుంబాన్ని లెక్క చేయకుండా పనిచేసిన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతదేహాన్ని తమకు అప్పగించకుండా మావోయిస్టులు మోసం చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కనీసం చివరి చూపు దక్కకుండా చేయడంపై వారు మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో హరిభూషణ్‌ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ బాధ్యులు గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా శుక్రవారం హరిభూషణ్‌ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు బతికున్న సమయంలో మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసు దెబ్బలు, జైలు జీవితం అనుభవించిన తమకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఇదేనా అని అడిగారు. హరిభూషణ్‌ చితాభస్మం లేకుండా కర్మ కాండలు ఎలా నిర్వహించుకోవాలని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఏ గ్రామంలో మృతదేహాన్ని ఉంచినా తామే వెళ్లి తెచ్చుకుని అంత్యక్రియలు నిర్వహించుకునే వారమంటూ వారు బోరున విలపించారు.

చదవండి: నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్‌ మృతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top