
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్/గంగారం: తమ పార్టీ అగ్రనేతలు మడవి హిడ్మా, శారద అలియాస్ జజ్జర్ల సమ్మక్కలు క్షేమంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. హిడ్మా, శారదక్కలు మరణించారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఒకవేళ వారు మరణిస్తే తామే సమాచారం ఇస్తామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత భారతక్క కరోనా బారినపడిన సమయంలో పోలీసులు, గ్రేహౌండ్స్ జవాన్లు తమపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అందుకే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తమ అగ్రనేతలకు సరైన చికిత్స అందించలేకపోయామని పేర్కొన్నారు.
ఎవరి మాటలు నమ్మాలి: లింగమ్మ
కరోనా నేపథ్యంలో ఇటీవల తన అల్లుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం అయిందని, చివరికి ఇదే విషయాన్ని మావోయిస్టులు అధికారికంగా ప్రకటించారని శారదక్క తల్లి లింగమ్మ అన్నారు. అది జరిగాక నాలుగు రోజులకే తన కూతురు శారదక్క కూడా మృతి చెందిందని ప్రచారం జరగడంతో తామంతా దుఃఖ సాగరంలో మునిగి పోయామన్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరికీ కలిపి పెద్దకర్మ చేసేందుకు కార్డులను ముద్రించామని చెప్పారు. కానీ ఇప్పుడు శారదక్క బతికుందని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో కుటుంబసభ్యులమంతా అయోమయంలో పడిపోయామని తెలిపారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.
చదవండి: దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు