కబురు చేస్తే చాలు.. పేదింటి పెళ్లికి పెద్దకొడుకు | Man Gave Mangalsutra And Saree To Newly Married Couple | Sakshi
Sakshi News home page

పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు..

Dec 10 2021 11:22 AM | Updated on Dec 10 2021 12:24 PM

Man Gave Mangalsutra And Saree To Newly Married Couple - Sakshi

సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్‌): జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నాయుడు రమ (భర్త శ్రీధర్‌ చనిపోయారు) కూతురు వసంతకు శుక్రవారం వివాహం నిశ్చయమయ్యింది. అలాగే తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్‌ పార్కులో ఉండే గాజుల లలిత కూతురు కీర్తి పెళ్లి కూడా ఇదే రోజున ఖాయమైంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న వీరు పేదరికం కారణంగా తెలిసిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకుడు లగిశెట్టి శ్రీనివాస్‌ను సంప్రదించారు.

వెంటనే స్పందించిన ఆయన పెళ్లికి అవసరమైన పుస్తె మెట్టెలు, పెండ్లి చీర, గాజులను అందజేసి పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు అవుతున్నాడు. ..ఇలా ప్రయోజనం పొందింది కేవలం వసంత, లలిత మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కార్మిక, కర్షక కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడపిల్లలు కల్యాణ సాయం కింద పుస్తె, మెట్టెలను అందుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నిరుపేద కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆర్థికంగా చితికిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్లకు తక్షణ సాయంగా పుస్తెమెట్టెలను అందిస్తూ సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్‌ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

నేపథ్యం.. ప్రస్తుతం
పట్టణంలో వస్త్ర వ్యాపారం చేసే లగిశెట్టి విశ్వనాథం, దేవేంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌. 1971 మార్చి 5న జన్మించిన శ్రీనివాస్‌ తన తండ్రి నుంచి వారసత్వంగా అందివచ్చిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ కాలానుగుణ మార్పులతో పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ముతక రకం నూలు వస్త్రం తయారయ్యే కాలంలో ఆధునికంగా ఆలోచించి క్లాత్‌ ప్రాసెసింగ్‌ రంగాన్ని పరిచయం చేశారు.

రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా..
తన ఉన్నతికి కారణమైన పట్టణంలోని ప్రజానీకానికి తన వంతుగా సేవలు అందించాలని సంకల్పించి 2011లో తన పేరిట చారిటబుల్‌ ట్రస్టును స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు ద్వారా సమాజ సేవలను అందిస్తున్నాడు.  

విద్యార్థులకు నోట్‌ బుక్కులు, పుస్తకాలు, వృద్ధాప్యంలో ఉన్నవారికి దుప్పట్లు ఏటా వితరణ చేసే ఆయన తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని తన సొంత స్థలంలో సంతోషిమాత దేవాలయాన్ని నిర్మించారు. ఆలయానికి పరిసరాల్లో వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. అవసాన దశలో అయినవాళ్ల నిరాదరణకు గురైన పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. సుమారు 20మందికి పైగా వృద్ధులు ప్రస్తుతం వృద్ధాశ్రమంలో తల దాచుకుంటున్నారు.

జన్మభూమి కోసం..
పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయడం ప్రతి మనిషి కనీస కర్తవ్యం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎదిగిన నేను నా వంతుగా సమాజానికి సేవలు అందించాలనుకున్నాను. ఆపన్నులకు అండగా ఉండేందుకు చారిటబుల్‌ ట్రస్టును స్థాపించా. వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు పేదల పెళ్లిళ్లకు సహాయపడటం సంతృప్తి నిస్తోంది. పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కావద్దని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకరిస్తున్నా. ఇదంతా సంతోషిమాతా దేవితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నా.

– లగిశెట్టి శ్రీనివాస్, ట్రస్టు నిర్వాహకుడు 

చదవండి: అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement