‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్‌

c - Sakshi

స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి

తోటి సోదరుడు రామ్‌ గాయకుడిగా గుర్తింపు

ప్రైవేటు ఆల్బమ్స్‌తో రాణిస్తున్న సోదరులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌ చేసి భర్తను సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్‌ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్‌ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి.
చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్‌ ఆఫర్‌

పాటల రచయిత కాటికె లక్ష్మణ్‌ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్‌తో పాటు రామ్‌ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్‌లక్ష్మణ్‌గా పేర్కొంటారు. రామ్‌ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్‌ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్‌ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్‌, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్‌ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్‌ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి.

‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్‌తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్‌కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో సోషల్‌ మీడియానే ట్రెండింగ్‌లోకి వచ్చింది.
చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు

ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్‌, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top