‘లాక్‌డౌన్‌’ కోత జీతాలు త్వరలో చెల్లింపు

Lockdown Cutting Salaries Will Be Paid Soon - Sakshi

పింఛన్‌దారులకు 2 వాయిదాలు 

ప్రభుత్వ ఉద్యోగులు,ఇతరులకు నాలుగు విడతలు 

కోత పెట్టిన జీతాల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల్లో కోత పెట్టిన మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పింఛన్‌దారులకు రెండు వాయిదాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు నాలుగు వాయిదాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఐఏఎస్‌ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల నుంచి విధించిన కోత మొత్తాన్ని మళ్లీ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పింఛన్‌దారులకు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో రెండు వాయిదాల్లో జమ చేయనున్నారు.

అదే విధంగా ఐఏఎస్‌ అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగోతరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను మాత్రం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌తో పాటు వచ్చే ఏడాది జనవరిలో కలిపి మొత్తం నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అదే విధంగా ప్రభుత్వరంగ సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే నాలుగు వాయిదాల్లో కోత పడిన వేతనాలను జమ చేయనున్నారు. కాగా, కోత విధించిన వేతనాలను ప్రభుత్వం ఏ రూపంలో జమ చేస్తుందోనన్న ఆందోళనలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు తాజా ఉత్తర్వులు ఊరట కలిగించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top