
మంగళవారం 50 వేల మంది పుష్కర స్నానాలు
సీఎం ఆదేశాలతో నేటి నుంచి నదీహారతి ప్రత్యక్ష ప్రసారం
భూపాలపల్లి/కాళేశ్వరం: అష్టమి కావడంతో త్రివేణి సంగమ తీరానికి ఉదయం వేళ భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా, క్రమక్రమంగా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి ఆరవ రోజైన మంగళవారం భక్తులు పుష్కర స్నానాలకు వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తజనం సరస్వతిçఘాట్‌కు చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి, నదీమాతకు విశేష పూజలు చేశారు. నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించారు.
ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిల సరస్వతీమాత, కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. 50 వేల మంది వరకు భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పడంతో సిబ్బంది బ్లీచింగ్ చల్లారు. వర్షం పడితే రోడ్లు బురదమయం కాకుండా గ్రావెల్ చిప్స్ వేసి నీటిని చల్లుతున్నారు.
ఎస్పీ కిరణ్‌ఖరే ట్రాఫిక్‌పై దృష్టి సారించారు. డివైడర్‌లు ఏర్పాటు చేసి పోలీసు ఫోర్స్‌తో వాహనాల నియంత్రణ చేపట్టారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్‌ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్‌రెడ్డిలు పుష్కర స్నానాలు చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కాగా, ప్రతీరోజు సరస్వతి పుష్కరాల్లో రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తున్న నవరత్నమాలిక హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
నదీ హారతికి భారీ స్పందన రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం నుంచి హారతి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, మంగళవారం రాత్రి నిర్వహించిన నవరత్నమాలిక హారతికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.