సీన్‌ రివర్స్‌ : గేదెల ఎదురుదాడిలో గాయపడిన చిరుత!

Leopard Tries To Attack Cattle Get Injured Koilkonda Mahabubnagar - Sakshi

పాకలో గేదెలపై దాడికి యత్నించిన చిరుత

ఎదురుదాడికి దిగిన గేదెలు

చిరుతకు తీవ్ర గాయాలు

బంధించి హైదరాబాద్‌ జూపార్క్‌కు తరలింపు 

కోయిల్‌కొండ/మహబూబ్‌నగర్‌: ‘ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో’.. ఓ గేదెల గుంపుపై దాడి చేసేందుకు యత్నించిన చిరుత.. వాటికే చిక్కి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలో గురువారం చోటుచేసుకుంది. బూర్గుపల్లి శివారు దేవునిగుట్ట సమీపంలోని పొలంలో రైతు నవాజ్‌రెడ్డి పశువుల పాక ఏర్పాటు చేసి అందులో నిత్యం గేదెలను ఉంచేవాడు. గురువారం ఉదయం దేవునిగుట్టలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా పాకలోని గేదె దూడలపై దాడి చేయబోయింది. దీంతో పక్కనే ఉన్న గేదెలు మూకుమ్మడిగా చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ క్రమంలో చిరుతకు తీవ్రగాయాలయ్యాయి.

అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత.. కొంతదూరం వెళ్లి అక్కడే నడవలేని స్థితిలో అచేతనంగా పడిపోయింది. సమాచారం తెలుసుకొని జనం భారీగా తరలివచ్చారు. ఓ వైపు కాళ్లకు గాయాలై నడవలేక పడిపోయిన చిరుత.. ప్రజలను చూసి గాండ్రించడంతో బెంబేలెత్తారు. కాసేపటికి గ్రామస్తులు ఓ బుట్టను నీటితో నింపి సమీపంలో ఉంచగా.. దాహం తీర్చుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చంద్రయ్య, గంగిరెడ్డి చిరుత గాయాలను పరిశీలించారు. హైదరాబాద్‌ జూపార్క్‌ నుంచి రెస్క్యూ టీం చిరుతకు మత్తుమందు ఇచ్చి నెహ్రూ జూపార్క్‌కు తరలించింది. 

చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top