
సాఫ్ట్‌వేర్ కోడ్ జనరేషన్‌లో అప్‌గ్రేడ్ కానివారికి లేఆఫ్ ముప్పు
ఏఐ టూల్ కోడింగ్ నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు
ఏటా ఏఐ ఆధారిత కొలువులు సాధిస్తున్న 3 లక్షల మంది.. వారిలోనూ స్కిల్స్ మెరుగుపరుచుకోని 1.20 లక్షల మందికి ఉద్వాసన
ఇంజనీరింగ్ కాలేజీలు అందిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో కానరాని సరికొత్త మార్పులు
ఏఐఎంఎల్, డేటా సైన్స్ వంటి కోర్సులు చేసిన వారికీ గగనంగానే ఉద్యోగాలు
నాస్కామ్–బీసీజీ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోడింగ్‌తో కొలువులు నెట్టుకొస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టెక్నాలజీ రంగంలో తెరపైకి వచ్చిన ‘బిగ్‌ఫిక్స్’ సవాల్ విసురుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్ కోడింగ్‌కు అనుగుణంగా నైపుణ్యాలకు పదునుపెట్టుకోని వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. ఇప్పటికే కొన్ని బహుళజాతి కంపెనీలు ‘అప్‌డేట్’ కాని ఉద్యోగులకు లేఆఫ్‌లు (ఉద్యోగాల నుంచి తొలగించడం) ప్రకటించగా మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు (నాస్కామ్) ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి ఏఐపై చేపట్టిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల్లో 68 శాతం మంది ఎమర్జింగ్ కోర్సులు చేస్తుండగా వారిలో 5 లక్షల మందే ఉద్యోగాలు పొందుతున్నారు. అలా కొలువులు సాధించిన వారిలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్నది 3 లక్షల మందే. వాళ్లలోనూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోనందుకు దాదాపు 1.20 లక్షల మంది ఏడాది తిరగకుండానే లేఆఫ్ లేఖలు అందుకుంటున్నారు. మిగతా వాళ్లలో 20 శాతం మందే సుమారు రూ. 40 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారు.
ఏమిటీ ‘బిగ్‌ఫిక్స్’?
విలువైన డేటాతో నిక్షిప్తమయ్యే లేదా బిడ్ డేటా సెంటర్లకు అనుసంధానమయ్యే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేయడాన్నే బిగ్‌ఫిక్స్ అంటారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు సెక్యూరిటీ కోసం సరికొత్త కోడింగ్, మాడ్యూల్స్‌ను అనుసరిస్తున్నాయి. సాధారణ కోడింగ్ నుంచి ఏఐ టూల్ కోడింగ్‌కు అప్‌డేట్ అయితే తప్ప బిగ్‌ఫిక్స్ తేలికగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ రూట్‌లో వెళ్లలేని సీనియర్ టెకీలు ఇప్పుడు లేఆఫ్‌లకు గురవుతున్నారు.
బిగ్ డేటా కేంద్రాలపై ఆధారపడే బహుళజాతి సంస్థలు సరైన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఇందుకు సమస్యగా మారుతోంది. సమీకృత ఏఐ ఆటోమేషన్‌లో సర్వర్ల స్థితి, సెక్యూరిటీ లాగ్స్, రిసోర్స్ యూజ్‌లను ట్రాక్ చేయడానికి మారుతున్న కోడింగ్ కీలకంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ కోడ్ జనరేషన్‌పై ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ అయితే తప్ప ఉద్యోగంలో అభివృద్ధి కనిపించదని అంటున్నారు.
కోడింగ్ కొత్తగా..
ఏఐ రంగంలో ఎప్పటికప్పుడు గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలోలాగా ఒకే మోడల్ కాకుండా మల్టీ ఏజెంట్స్ కొలాబరేషన్‌తో ఏఐ పనిచేస్తోంది. మారుతున్న ఈ మోడల్స్‌ను ఏఐ ఏజెంట్ సిస్టమ్‌గా పిలుస్తున్నారు. ఉదాహరణకు మెటా కోడ్ ఏజెంట్‌పై 2024 నుంచి అనేక పరిశోధనలు చేశారు. ఇప్పుడిది ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌లో కోడ్ రాసే స్థాయికి ఎదిగింది. ఈ కోడ్‌ను ప్రాక్టికల్‌గా పరీక్షించడం, తప్పులు సరిచేయడం చేస్తుంది.
‘ఆటోడెవ్’ ఫ్రేమ్‌వర్క్ కొన్ని మోడల్స్‌తో కలిసి కొత్త సాఫ్ట్‌వర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూరోపియన్ ఏఐ అలయన్స్ కొత్తగా ఎథికల్ ఏఐ కోడ్ జనరేషన్, ట్రాన్స్‌ఫరెన్స్ ఏఐ రైటింగ్ కోడ్, ఏఐ జనరేటెడ్ అకౌంటబులిటీ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చాయి. దీంతో వాటి మూలాలు, పనిచేసే విధానం, వాటికి మెరుగైన ప్రోగ్రామింగ్ ఇవ్వడంలో మెళకువలు ఉన్న ఏఐ నిపుణులు మాత్రమే ఈ వేగాన్ని అందుకొనే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎమర్జింగ్ కోర్సుల్లో కొత్తదనం ఏదీ?
కొన్ని కాలేజీలు ఇంకా దశాబ్దకాలం నాటికి సీ, సీ ప్లస్ కోడింగ్‌తోనే ఎమర్జింగ్ కోర్సులు మొదలు పెడతున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు కొన్ని ఆధునిక కోడ్‌ను అనుసరిస్తున్నాయి. ఏఐ మోడల్స్ స్వయంగా అల్గోరిథంను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్‌గా వస్తోంది. 600కుపైగా ప్రోగ్రాములతో రూపొందించిన కోడ్ టీ5 ప్లస్, స్టార్ కోడ్ 2 వంటి జనరేటివ్ మోడల్స్ ఇప్పటికీ ఐఐటీలకే పరిమితం అవుతున్నాయి.
వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ తరహా మోడల్స్ ఉండటంలేదు. దీంతో ఏఐఎంఎల్, డేటా సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం టెక్నాలజీ రౌండ్, కోడింగ్ రౌండ్‌లలో ప్రతిభ చూపలేకపోతున్నారు. ఫలితంగా ఫ్రెషర్స్ ఏఐ కోర్సుల ద్వారా ఆశించిన ఉద్యోగాలు పొందలేని స్థితి నెలకొంది.
మారాల్సిందే
ఎమర్జింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులతోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం మారుతున్న ఏఐ కోడ్‌కు అప్‌డేట్ కావాలి. లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం. కొన్ని బహుళజాతి కంపెనీలు ఈ దిశగా శిక్షణ ఇస్తున్నాయి. ఆన్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు నైపుణ్యం సాధించాలి.
– డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి, జేఎన్‌టీయూహెచ్
లేఆఫ్‌లు తప్పట్లేదు
టెక్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు కూడా పరిమిత కాలంలో ఏఐ కోడింగ్‌ను నేర్చుకోవడం, కొత్త కోడింగ్‌లో నైపుణ్యం పొందడంలో విఫలమవుతున్నారు. వారికి ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు కష్టంగా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్‌తో అనుసంధానమయ్యే కంపెనీ సమాచారాన్ని కాపాడే సామర్థ్యం వారికి ఉండటం లేదు. అందుకే లేఆఫ్‌లు ఇవ్వడం అనివార్యమవుతోంది.
– పరిమళ సిద్ధార్థ్, ఓ ఏఐ సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్