బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు కేటీఆర్‌ వరాల జల్లు

KTR At Promises to Develop Basara IIIT 5th Convocation of RGUKT - Sakshi

సాక్షి, నిర్మల్‌: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్‌ బ్లాక్‌ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు.

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్‌ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు.  ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

టీహబ్‌తో బాసర ట్రిపుల్‌ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని  కేటీఆర్‌ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top