హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్‌ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది.
ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్‌లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు.
మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది.
ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.
దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


