‘కృష్ణా’లో తాత్కాలిక కోటాకు బ్రేక్‌!  | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’లో తాత్కాలిక కోటాకు బ్రేక్‌! 

Published Sun, May 21 2023 3:02 AM

Key Decisions in 17th General Meeting of Krishna Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు కొనసాగింపునకు బ్రేక్‌ పడింది. 2015 నుంచి కొనసాగుతున్న తాత్కాలిక బటా్వడాను 2023–24 నీటి సంవత్సరంలోనూ కొనసాగించాలని ఏపీ పట్టుబట్టగా తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఈలోగా 2023–24లో ఇరు రాష్ట్రాల నీటి అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు నీటి కేటాయింపులపై బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాలకు పంపిన సమావేశం మినట్స్‌లో ఈ అంశాన్ని బోర్డు వెల్లడించింది. 

9 ఏళ్ల తర్వాత తాత్కాలిక కోటాకు బ్రేక్‌ 
బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీల(34 శాతం)ను తాత్కాలిక కోటాగా 2015లో కేంద్ర జలశక్తి శాఖ కేటాయించింది. ఆ తర్వాత నుంచి ఏటా ఈ కేటాయింపులను కృష్ణా బోర్డు గతేడాది వరకు కొనసాగించింది. తమ సమ్మతి లేకుండా 66:34 నిష్పత్తిలోని కోటాను కొనసాగించే అధికారం బోర్డుకు లేదని, ఈ అంశంపై అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం కోసం కేంద్రానికి రిఫర్‌ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ బోర్డు సమావేశంలో పట్టుబట్టారు.

ఉమ్మడి రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులకు బచావత్‌ ట్రిబ్యునల్‌ జరిపిన కేటాయింపుల ఆధారంగా 66:34 నిష్పత్తిలో తాత్కాలిక కోటాను ఖరారు చేశారని, దీన్నే కొనసాగించాలని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని కేంద్రానికి రిఫర్‌ చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం బోర్డుకు లేదా కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు వరుసగా 40, 40, 25 టీఎంసీలు కలిపి మొత్తం 105 టీఎంసీలు అవసరం కాగా, కేటాయింపులు లేవని తెలంగాణ తరఫున రజత్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో వాటిని అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చినందున నీటి కేటాయింపులకు అడ్డంకిగా మారిందన్నారు. 66:34 ని ష్పత్తిలో జరిపిన తాత్కాలిక కేటాయింపు లకు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులతో సంబంధం లేదని ఏపీ వాదనను కొట్టిపారేశారు. ఇరుపక్షాల మధ్య సమ్మతి కుదరకపోవడంతో ఈ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. 

కేంద్రం వద్దకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం 
గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ మరోసారి తెగేసి చెప్పింది. ఈ అంశాన్ని కేంద్రం ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌కు నివేదించాలని, గెజిట్‌ నోటిఫికేషన్‌పై పునఃసమీక్ష కోరాలని డిమాండ్‌ చేసింది.

తెలంగాణ సూచన మేరకు ఈ అంశాన్ని కేంద్ర జలశక్తిశాఖకు రిఫర్‌ చేయాలని బోర్డు నిర్ణయించింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టుల విభాగాలను బోర్డుకు అప్పగిస్తే తమ భూభాగంలోని విభాగాలను సైతం అప్పగిస్తామని ఏపీ స్పష్టం చేసింది.  

Advertisement
Advertisement