
ఎర్రవల్లిలో పార్టీ నేతలతో కీలక భేటీలో కేసీఆర్ ఆదేశం
‘స్థానికం’వాయిదా నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చ
త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీ సన్నద్దతపైనా సమీక్ష
పాల్గొన్న కేటీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్ రూమ్ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్‌ను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం.