నిరసన తెలిపితే కాల్పులా?: కవిత | MLC Kavitha Fires On Teenmaar Mallanna Over His Inappropriate Comments Against Her | Sakshi
Sakshi News home page

నిరసన తెలిపితే కాల్పులా?: కవిత

Jul 14 2025 5:31 AM | Updated on Jul 14 2025 10:00 AM

Kavitha fires on Teenmar Mallanna: Telangana

తీన్మార్‌ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్‌ చేయాలి

మల్లన్న వ్యాఖ్యలు ఆయనవేనా? ప్రభుత్వం చేయించిందా?.. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు

మల్లన్నపై మండలి చైర్మన్‌ గుత్తాతోపాటు పోలీసులకు ఫిర్యాదు

తాను మామూలు ఆడబిడ్డను కాదని.. అగ్గిరవ్వనని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆదివారం కలిసిన కవిత.. మల్లన్న సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారని, అంతమాత్రానికే ల్పులు జరిపి చంపేస్తారా? అని ప్రశ్నించారు.

 సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనతో అలా మాట్లాడించింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాల్పులపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని వ్యాఖ్యానించారు. మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కవిత అన్నారు. తనను అగౌరవ పరిచిన తీన్మార్‌ మల్లన్నపై బీఎన్‌ఎస్‌ 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అదనపు ఐజీ రమణకుమార్‌కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే చెల్లదని స్పష్టంచేశారు.

కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు
తీన్మార్‌ మల్లన్న క్యూన్యూస్‌ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–14లోని కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుమారు 50 మంది పోలీసులతో నాలుగు చోట్ల పికెటింగ్‌లు ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement