జూరాల భద్రమేనా? | Jurala Project 4th gate iron rope was damaged | Sakshi
Sakshi News home page

జూరాల భద్రమేనా?

Jun 27 2025 12:41 AM | Updated on Jun 27 2025 5:56 AM

Jurala Project 4th gate iron rope was damaged

4వ గేటులో తెగిన ఇనుప రోప్‌

తాజాగా తెగిన ప్రాజెక్టు 4వ గేటు ఇనుప రోప్‌

ఇదివరకే తెగిన మరో 8 గేట్ల ఇనుప రోప్‌లు

దెబ్బతిన్న 18 గేట్ల రబ్బర్‌ సీళ్లు.. ఏడాదిగా లీకేజీలు

ప్రమాదం లేదంటున్న ఇరిగేషన్‌ అధికారులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/గద్వాల: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిదైన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పాలమూరు జిల్లా వరప్రదాయినిగా నిలుస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడు లక్షలకు పైగా ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ఏళ్ల తరబడి మర మ్మతులు కరువయ్యాయి. సుమారు ఏడాది కాలంగా గేట్ల నుంచి నీళ్లు లీకవుతుండగా, తాజాగా నాలుగో గేట్‌ ఇనుప రోప్‌ తెగిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జూరాల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

దెబ్బతిన్న రోప్‌లు, రబ్బరు సీళ్లు..
జూరాల ప్రాజెక్ట్‌కు పై నుంచి వచ్చిన నీటిని గానీ, సాగు అవసరాలకు గానీ ఆపరేట్‌ (పైకెత్తడం) చేయడం ద్వారా దిగువకు నీరు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో మొత్తం 62 గేట్లను అర్ధ చంద్రాకారంల్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిని పైకి, కిందికి ఆపరేట్‌ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్‌ సీళ్లు (రాపిడికి గురికాకుండా రక్షణ ఇచ్చేది), అడుగుభాగాన ఒక రబ్బర్‌ సీల్‌తో పాటు గేటుకు ఇరువైపులా రెండు, కింది భాగాన రెండు ఇనుప రోపులు అమర్చారు. 

వీటి సాయంతోనే రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను అవసరమైనప్పుడు పైకెత్తడం, దించడం జరుగుతుంది. అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం.. లేనిపక్షంలో నిలిపివేయడంలో ఇవి కీలకం. అలాంటి ఎనిమిది గేట్ల ఇనుప రోప్‌లు, 18 గేట్ల రబ్బర్‌ సీళ్లు దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడ్డాయి.

40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. 
జూరాల ప్రాజెక్టు చరిత్రలో 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా అన్ని గేట్ల్లకు సంబంధించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు సుమారు నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రబ్బర్‌ సీళ్లు, రోప్‌లు, శాండ్‌ బ్లాస్టింగ్, గేట్ల బలోపేత, బకెట్‌ నిర్మాణాల మరమ్మతులు, పెయింటింగ్‌ పనులు చేపట్టాలి. హైదరాబాద్‌కు చెందిన స్వప్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పనులు దక్కించుకుంది. 

ఏడాది కాలపరిమితిలో  పూర్తిచేసేలా ఒప్పందం కుదిరింది. ఏడాది గడువు ముగిసింది. మరోసారి పొడిగించారు. అయినా.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో సగం శాతం పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. ప్రాజెక్టు పైభాగాన ఉన్న హయిస్ట్‌ బ్రిడిŠజ్‌ గేట్ల వద్ద వాక్‌వే బ్రిడ్జికి సంబంధించి శాండ్‌ బ్లాస్టింగ్‌ పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 

తాజాగా వరద వదలడంతో..
తాజాగా గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 98 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. అయితే గురువారం ప్రాజెక్టు నాలుగో గేట్‌ ఇనుప రోప్‌ తెగిపోయి కన్పించింది. దీంతో ఆ గేట్‌ ఎత్తలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం, భద్రత తదితర అంశాలు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. 2009 మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

అధికారులది పాత పాటే..
జూరాల ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం, భద్రతపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో  ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా నాలుగో గేట్‌ రోప్‌ తెగిన నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులతో పాటు గద్వాల జిల్లా ఇరిగేషన్‌ అధికారులను సంప్రదించగా.. గతంలో చెప్పిన సమాధానాలే చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు మెకానికల్‌ పనులు చేసే ప్రైవేట్‌ ఏజెన్సీలు తక్కువగా ఉన్నాయి. 

ఈ కారణంగా నాలుగేళ్ల కిందట జూరాల మరమ్మతులకు నిధులు మంజూరు అయినప్పటికీ .. కాంట్రాక్టు ఏజెన్సీ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ప్రాజెక్టుకు పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రమాదమేం లేదు..’ అని చెప్పారు. అయితే మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ముందస్తు వరదతో పనులకు ఆటంకం
జూరాల ప్రాజెక్టు గేట్లు, రోప్‌లకు సంబంధించి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈసారి అన్ని రకాల సమస్యలను అధిగమించి మెకానికల్‌ పనులను వేగవంతంగా చేపట్టాలనుకున్నాం. అయితే ముందస్తుగా వరద రావడం ఆటంకంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు కావడంతో ఎంత పెద్ద వరద వచ్చినా కొట్టుకుపోయే అవకాశం లేదు.
– రహీమొద్దీన్, సాగునీటి పారుదల శాఖ ఎస్‌ఈ, జోగుళాంబ గద్వాల

ఇదీ ప్రాజెక్టు స్వరూపం.. 
జూరాల ప్రాజెక్టును 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. దీని పొడవు కిలోమీటర్, ఎత్తు 27.80 మీటర్లు. మొత్తం రాతికట్టడమే. ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఎడమ వైపున 1.74 కి.మీలు, కుడివైపున 1.84 కి.మీల మేర ఎర్త్‌డ్యాం నిర్మించారు. మొత్తం 62 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు, 84 బ్లాకులతో నిర్మాణం చేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement