Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!

Junctions, U turns in Cyberabad: Traffic Cops Invite Proposals From Locals - Sakshi

సైబరాబాద్‌లో జంక్షన్లు, యూ టర్న్‌లు

స్థానికుల నుంచి అభ్యర్థనల స్వీకరణ

క్షేత్రస్థాయిలో అధ్యయనం తర్వాతే నిర్ణయం

వక్రమార్గంలో ప్రయాణం, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్‌లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాంగ్‌ రూట్‌లో వెళుతూ.. 
‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్‌ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్‌ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్‌ రూట్‌లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్‌లు, జంక్షన్లు, ట్రాఫిక్‌ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. 
ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్‌ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్‌ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్‌ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్‌ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.  

యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. 
ఇప్పటివరకు యూటర్న్‌లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
► ఐఐఐటీ జంక్షన్‌ నుంచి విప్రో జంక్షన్‌ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్‌ మోటార్స్‌ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు.  
► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్‌ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. 
► గచ్చిబౌలి జంక్షన్‌ ఇందిరానగర్‌ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. 
► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్‌ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. 

జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి  
అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష
గ్రేటర్‌ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్‌ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్‌ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు.

సీఆర్‌ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా  ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. (క్లిక్‌:  విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్‌’ సిటీ పరిస్థితి ఏంటి?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top