జేఈఈ మెయిన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

JEE Mains Notification Released - Sakshi

మొదలైన దరఖాస్తుల ప్రక్రియ 

ఈ నెలాఖరు వరకూ దరఖాస్తులకు చాన్స్‌ 

పరీక్షకు మూడు రోజుల ముందు హాల్‌ టికెట్లు 

మెయిన్స్‌కు భారీగా తగ్గిన సిలబస్‌ 

ఈసారి కాస్త తేలికగానే పేపర్‌ కూర్పు 

ఫిబ్రవరి 12న ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్‌టీఏ

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థుల హాల్‌ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 

దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మిగతా జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఉంటుంది. రెండో దశ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ సెషన్‌కైనా, లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్‌ ఉంటుంది. 

ప్రతీ సబ్జెక్టులోనూ 10 టాపిక్స్, ఫిజిక్స్‌లో 12 టాపిక్స్‌ తీసివేత 
కోవిడ్‌ సమయంలో ఎన్‌సీఈఆర్టీ, సీబీఎస్‌ఈ సిలబస్‌ను కుదించారు. దీంతో కొన్ని టాపిక్స్‌లో బోధన జరగలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్‌ సిలబస్‌లోనూ ఈసారి భారీ మార్పులు చేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో పది చొప్పున, ఫిజిక్స్‌లో 12 చొప్పున టాపిక్స్‌ను జేఈఈ మెయిన్స్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు.

జేఈఈ పరీక్ష కఠినంగా ఉంటోందనే సంకేతాలు రావడంతో ఈసారి పరీక్ష పేపర్‌ కూర్పులోనూ మార్పులు చేశారు. ముఖ్యంగా గణితంలో సుదీర్ఘ పద్ధతిలో సమాధానాలు రాబట్టే ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. మాథ్స్‌లో కఠినంగా భావిస్తున్న ట్రిగా్నమెట్రిక్స్‌ ఈక్వేషన్స్, మేథమెటికల్‌ రీజనింగ్‌ను తొలగించారు. దీనివల్ల సమాధానాలు రాబట్టేందుకు సమయం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top