ఆడపిల్ల పుడితే పండుగ చేస్తున్నారు!

Jagtial Thimmapur Sarpanch Used To Give Rs 5000 On Girls Marriage - Sakshi

ఆపరేషన్‌ ఉచితం.. ఆడపిల్ల పుడితే కానుక..పెళ్లికి కట్నం

ఆడపిల్లా.. అంటూ ఇప్పటికీ ముఖం చిట్లించే వారెందరో! కానీ ఈ ముగ్గురూ ఆడపిల్ల పుట్టుకను పండుగ చేస్తున్నారు. ఓ సర్పంచ్‌ ఆడపిల్ల పుడితే రూ.5 వేలు కానుకగా ఇస్తుంటే.. ఇంకో సర్పంచ్‌ ఆడపిల్లకు కట్నంగా రూ.5,016 అందజేస్తున్నారు. ఇంకో వైద్యురాలు ఆడపిల్ల పుడితే ఆపరేషన్‌ ఉచితంగా చేస్తున్నారు. ఈ ముగ్గురి పరిచయం..

ఆడబిడ్డ కట్నం రూ.5,016
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌ సర్పంచ్‌ నేరెళ్ల హేమలత మహిళా ప్రజాప్రతినిధిగా గ్రామాన్ని ప్రగతిపథంలో నడపడమే కాదు.. ఆ ఊళ్లో పుట్టే ప్రతి ఆడపిల్లకు అండగా నిలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఏ ఇంట ఆడబిడ్డ పెళ్లి జరిగినా కట్నంగా రూ.5,016 ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 36 యువతులకు చెక్కులను అందించారు. ఇటీవలే ఒకేసారి గ్రామంలో 67 మందికి కరోనా పాజిటివ్‌ రాగా పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి బాధితులకు పౌష్టికాహారం అందించారు. వలసకూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందచేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఆడబిడ్డలకు పెండ్లి కానుకతో పాటు, తోటివారికి తోచిన సాయం చేస్తానని సర్పంచ్‌ హేమలత చెబుతున్నారు.

ఆడపిల్ల పుడితే రూ.5 వేలు

ఆదర్శంగా నిలుస్తున్న బీబ్రా సర్పంచ్
దహెగాం(సిర్పూర్‌): ఆడపిల్ల పుడితే తల్లి పేరిట రూ.5వేలు కానుకగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురంభీం జిల్లా దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్‌ బండ కృష్ణమూర్తి. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన వెంటనే తన సొంత డబ్బును పోస్టాఫీసులో మాతృమూర్తి పేరిట డిపాజిట్‌ చేస్తున్నారీయన. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పే ఈయన.. ఆడపిల్లను తల్లిదండ్రులకు బరువుగా భావించకూడదంటారు. 2020 జూన్‌ 2న, తన తల్లిదండ్రులైన బండ సుదర్శన్‌–సులోచనల పెళ్లిరోజును పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్‌ చేస్తానని ఈయన గ్రామస్తుల ముందు ప్రకటించి.. అలాగే చేస్తున్నారు.

‘అపూర్వ’ సాయం

భైంసాటౌన్‌(ముథోల్‌): ఆడపిల్ల అని తెలిస్తే.. గర్భంలోనే చిదిమేస్తున్న తల్లిదండ్రులను చూసి చలించిన ఆమె.. తనవంతుగా ఆడశిశువును బతికించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చేవారికి ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్‌ చేస్తున్నారు. భైంసాకు చెందిన డాక్టర్‌ అపూర్వ.. భర్త డాక్టర్‌ రజనీకాంత్‌తో కలిసి భైంసాలో ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 2016 నుంచి తమ ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న వారికి ఆడబిడ్డ పుడితే ఎలాంటి రుసుం లేకుండా ఆపరేషన్‌ చేస్తున్నారు. ఇప్పటికి 400 ఉచిత ఆపరేషన్లు చేశామని అంటున్నారీమె. ‘గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చాలామంది అబార్షన్‌ చేయిస్తున్నారు. వైద్యవృత్తిలో ఉన్నందుకు మా వంతుగా ఆడపిల్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నా’మని చెప్పారు డాక్టర్‌ అపూర్వ.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top