
కాపలాదారులం.. తెలంగాణ తల్లి వాకిట జాగిలాలం
భుజాలు తడుముకొని రాధాకృష్ణ నేరాన్ని అంగీకరించారు
కులచట్రంలో ఇరుక్కుని ఉండటమే ఆయన మరుగుజ్జుతనం
కేసీఆర్ దయాగుణం వల్లే నువ్వు.. చంద్రబాబు బయట ఉన్నారు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచమంతా కుల, మతాల గోడల్ని బద్దలు కొట్టి నాగరికత వైపు వెళుతుంటే..ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ ఇంకా కులచట్రంలోనే ఇరుక్కుని మరుగుజ్జుతనంతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కొత్తపలుకు పేరిట ఇటీవల ఆంధ్రజ్యోతిలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘పోలీసులకు దొరికినప్పుడు దొంగ తత్తరపడినట్టు రాధాకృష్ణ రాతల్లోనూ అలాంటి ధోరణే కనిపిస్తోంది. భుజాలు తడుముకుని నేరాన్ని తన రాతల్లో రాధాకృష్ణ అంగీకరించాడు.
హైదరాబాద్‌తో సహా తెలంగాణలో స్థిరపడిన వారందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలో సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నేరుగా కేసీఆర్‌తో ఢీకొన్నా సెటిలర్లు కేసీఆర్ వెంట నిలిచారు. 2023లోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. ఇక్కడ స్థిరపడిన ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు, నువ్వు టేకేదారులు అని చెప్పుకున్నా..తిరస్కరించిన సంగతి గుర్తు పెట్టుకోండి.
మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఏపీకి చెందిన ఓ వర్గంవారు ఇక్కడి నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాళ్ల మీడియా ముసుగులు తొలగించి భరతం పడతామని నేను చెప్పాను. తమ అభిమాన నాయకుల వ్యక్తిత్వ హననంపై అభిమానులు, కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం మీకు చాలా పెద్దదిగా కనపడింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాతల్లో పేర్కొన్నట్టు ‘నిజమే మేము జాగీరుదారులం కాదు.. తెలంగాణతల్లి వాకిట జాగిలాలం, కాపలాదారులం’అని జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.
కేసీఆర్ దయాగుణం వల్లే బయట ఉన్నారు
‘ఉద్యమ సందర్భంలో మీరెంత విషం చిమ్మినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రివర్గంపై, శాసనసభపై మీరు దిగజారి మాట్లాడినా ఏ విచారణ అక్కర లేకుండా, మిమ్మల్ని 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా కేసీఆర్ క్షమాభిక్ష, దయాగుణం వల్లే బయట ఉన్నావు. మీతోపాటు మీ గురువు చంద్రబాబును జైలుకు పంపే అవకాశం వచ్చినా వదిలేయడం కేసీఆర్ గొప్పతనం. మోదీ అండ, చంద్రబాబు చెంతన ఉన్నారని, తెలంగాణ సీఎం చెప్పుచేతుల్లోనే ఉన్నారని, ఉడత ఊపులకు భయపడనని హూంకరించిన మీరు వందలమంది పోలీసులను కాపలా తెచ్చుకున్నారు.
వాళ్లను, వీళ్లను బతిమాలి జరగని దాడికి ఖండనలు ఇప్పించుకుంటున్న తీరు ఏ ఊపులకు మీరు భయపడుతున్నారో అర్థమవుతుంది. సాధారణంగా మరుగుజ్జు అంటే సహజత్వానికి భిన్నంగా ఉండడం, ఎదగాల్సిన స్థాయిలో ఎదగకపోవడం లేక మానసికంగా వికసించకపోవడం. తెలంగాణ వికాసం కోసం పోరాటం చేసిన నా పరిపక్వత, రాజకీయ ప్రస్థానమేంటో అందరికీ తెలుసు. రామోజీరావుతో పోల్చుకొని పోటీపడి ఆయన పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామనుకొని, ఎక్కడికో చేరుకుందామనుకొని.. అదీ చేరుకోలేకపోయావనే బాధ నీలో కనిపిస్తోంది.
ఇంకా జర్నలిజం ఓనమాలలోనే ఉన్న వానికి పాపులారిటీ వస్తుందని, పోటీకొస్తున్నాడని భయపడి లేని దాడిని సృష్టించుకొని నీవు చేస్తున్న హంగామా నీ మరుగుజ్జుస్థాయికి నిదర్శనం. మీడియా అనుకొని నమ్మి బెదిరింపులు లేదా మీ బ్లాక్‌మెయిల్‌తో మీ స్టూడియోకు వచ్చిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, సినీతారలు, ఇతర ప్రముఖులతో ప్రవర్తించే తీరు, జుగుప్సాక రమైన ప్రవర్తన అహంకారానికి నిదర్శనం. చాలామంది మహిళా సెలబ్రిటీలు మీ ఇంటర్వ్యూకు రావడానికి భయపడుతున్నారనేది వాస్తవం’అని జగదీశ్‌రెడ్డి తన ప్రకటనలో రాధాకృష్ణ తీరును ఎండగట్టారు.