ఇటు ప్రవేశాలు.. అటు తరగతులు

Inter Board Issuance of first year admissions schedule - Sakshi

ఇంటర్‌ బోర్డు వింత పోకడ

ప్రథమ సంవత్సర ప్రవేశాల షెడ్యూల్‌ జారీ

30 వరకు ఫస్టియర్‌లో ప్రవేశాలకు అవకాశమని వెల్లడి

18 నుంచే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేలా షెడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు, తరగతుల ప్రారంభం విషయంలో ఇంటర్‌ బోర్డు విచిత్రమైన షెడ్యూల్‌ జారీ చేసింది. మొదటి దశ ప్రవేశాలను బుధవారం(16వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని, బుధవారమే ప్రకటించిన బోర్డు, 30 వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నా, ఆన్‌లైన్‌ తరగతులను శుక్రవారం నుంచే (18వ తేదీ) ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. దీంతో ఫస్టియర్‌ ప్రవేశాలకు కనీసం ఐదారు రోజుల సమయం కూడా ఇవ్వకుండా, విద్యార్థుల చేరికలు మొదలుకాగానే తరగతుల ప్రారంభానికి షెడ్యూల్‌ ఏంటని అధ్యాపకులే ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ షెడ్యూల్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు అన్నింటికీ వర్తిస్తుందని పేర్కొంది.

మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్‌ కోటా
మరోవైపు జూన్‌ 1న కావాల్సిన తరగతులు ఇప్పటికే ఆలస్యం అయినందున నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు ఫస్టియర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించేలా బోర్డు చర్యలు చేపట్టింది. రెండో దశ ప్రవేశాల షెడ్యూల్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ప్రిన్సిపాళ్లు పదో తరగతిలో విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులతో కేటా యించిన గ్రేడ్‌ పాయింట్‌ ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని తెలిపింది. కాలేజీల్లో  ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్లతోపాటు ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థులకు 10 శాతం సీట్లను కేటాయించాలని,  మొత్తంగా బాలికలకు 33.33 శాతం సీట్లను   కేటాయించాలని వివరించింది. ప్రతి సెక్షన్‌లో 88 మందినే తీసుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించింది. జోగినీ పిల్లలకు తండ్రి స్థానంలో తల్లి పేరును నమోదు చేయాలని స్పష్టం చేసింది.

అనుబంధ గుర్తింపు ఇంకా ఇవ్వలేదు..
రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. పైగా ఈ నెల 22 వరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీ యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అదే బోర్డు బుధవారం నుంచే కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, 18 నుంచి తరగతు లు కొనసాగుతాయని ప్రకటించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపే ఇవ్వకుండా ఎలా ప్రవేశాలు చేపడతారన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. పైగా అనుబంధ గుర్తింపు లేని (అఫిలియేషన్‌) కాలేజీల్లో చేరవద్దని, నష్టపోవద్దని ఇంటర్‌ బోర్డు ప్రతిసారీ ప్రకటనలు జారీచేస్తుండటం గమనార్హం. దీంతో రాష్ట్రం లోని 1496 ప్రైవేటు కాలేజీల్లో ఏ కాలేజీకి ఇం టర్‌ బోర్డు అనుబంధ గుర్తింపును ఇస్తుందో.. ఏ కాలేజీకి ఇవ్వదో తెలియదు. 1136 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు మాత్రం తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top