
కేబినెట్ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం!
అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు
అసెంబ్లీ లాబీల్లో హాట్‌టాపిక్‌గా మంత్రివర్గ విస్తరణ
ఢిల్లీ భేటీపై డిప్యూటీ సీఎం భట్టిని ఆరా తీసిన ఎమ్మెల్యేలు
రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు అభినందనలు
ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పైనా చర్చ
డిప్యూటీ స్పీకర్ రేసులో బాలూ నాయక్‌తో పాటు ఎన్.పద్మావతిరెడ్డి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి.. ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు.
ఇంకా సమాచారం లేదన్న ఆ ముగ్గురూ..
మంగళవారం శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎమ్మెల్యేలతో హడావుడిగా కనిపించింది. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్‌కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు.
మరోవైపు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురూ.. మరోవైపు ఇంకా సమాచారమేమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.
ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బయలుదేరేంతవరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్‌మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖత్‌లకు వెళ్లని రేవంత్ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది.
కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు.

ఇద్దరు కీలక మంత్రుల శాఖల్లో మార్పులు!
కేబినెట్‌లోకి కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతుండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతమున్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొందరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి.
శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలిస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్.బాలూనాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్ విప్ పదవిలో ఎవరిని నియమిస్తారు?, విప్‌లలో ఎవరికైనా మంత్రిగా అవకాశమిస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతుండడం గమనార్హం.