
సాక్షి, వనస్థలిపురం(హైదరాబాద్): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు. చదవండి: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి!
అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్‌కు రిఫర్ చేశామని చెప్పారు. చదవండి: పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు కొత్త విధానం
బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్‌పేట కార్పొరేటర్ రాజ్‌కుమార్, తదితరులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.