పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొత్త విధానం

New Procedure For Submission Of Life Certificates Of Pensioners - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్‌ కార్యాలయాలకు రావొద్దని, బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు/మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) పేర్కొంది. లేదా ఆధార్‌తో కూడుకున్న బయోమెట్రిక్‌ డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పింవచ్చని ఈపీఎఫ్‌వో తెలిపింది. సాధారణంగా ఏటా నవంబర్‌/డిసెంబర్‌లో పెన్షనర్లు పీఎఫ్‌ ఆఫీసుల్లో లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్‌ జీవన్‌ ప్రమాణ్‌ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో వివరించింది. చదవండి: క్వారంటైన్‌లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్

సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్‌ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్‌ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ (మల్టీ–ఏజెన్సీ) మోడల్‌ను ఈపీఎఫ్‌వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్కు, పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ నెంబర్, ఆధార్‌ నెంబర్‌ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది. స్థానిక పోస్ట్‌మాన్‌/సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించడం లేదా ఉమాంగ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తమ చేతివేలిముద్ర స్కానింగ్‌ను పంపించడంతో సమర్పించవచ్చని పేర్కొంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా (కేవలం నవంబర్, డిసెంబర్‌లోనే కాకుండా) ఈపీఎస్‌ పెన్షనర్లు ‘డిజిటల్‌ జీవన్‌ ప్రమాణ్‌’ల సమర్పణకు కీలకమైన విధానమార్పును చేపట్టినట్లు తెలిపింది. ఈ విధంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top