కాబోయే భర్తపై మృతురాలి కుటుంబం ఆరోపణలు
మరిపెడ రూరల్: ఆ ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు.. కానీ విధి మరోలా తలచింది. రెండేళ్ల ప్రేమ, పెళ్లి కోసం చేసిన పోరాటం ఇవన్నీ కళ్లముందే ఉండగా, ఆ యువతి విగతజీవిగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి, అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఇటుకలగడ్డతండాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి.
ప్రేమ యుద్ధం చేసి..: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య వెంకన్న, వినోద దంపతుల చిన్న కూతురు సంగీత (19), మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఒప్పించే క్రమంలో సంగీత గతంలో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. చివరకు వారి ప్రేమను ఇరుకుటుంబాలు అంగీకరించి, ఈ నెల 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సంగీత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సంగీత ఇటుకలగడ్డతండాలో ఒక్కతే ఉండగా అరవింద్ బైక్‌పై వచ్చి యువతిని తీసుకుని తండా శివారులోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మర్నాడు బుధవారం తండా శివారులోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం లభించింది.
బావి సమీపంలో రక్తపు మరకలతో ఓ చెప్పులు కనిపించడంతో సంగీత మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. కాబోయే భర్తే తమ కూతురిని అన్యాయంగా హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి తల్లిదండ్రులు వెంకన్న, వినోద ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


