చనిపోయిన వ్యక్తి లేచొచ్చాడా?

Illegal Land Registration In Scam Busted In Nizamabad - Sakshi

నగరంలోని సర్వే నెం.173లో మూడు ఎకరాలపైనే ఉన్న భూమిని 143 గజాల భూమిగా చూపి రిజిస్ట్రేషన్‌ చేశారు. గమ్మత్తైన విషయమేమంటే ఆధార్‌ కార్డులో తండ్రి పేరు మార్చి రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పై ఉదంతాలే నిదర్శనం. ముగ్గురు రాజకీయ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకులు, ఉద్యోగ సంఘం నాయకుడు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌తో కలిసి పేదల భూములకు ఎసరు పెట్టారు. అలాగే, సర్కారు ఆదాయానికి గండి కొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్‌ ఇవ్వడం గమనార్హం. 

సస్పెండైన ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు దండిగా అలవాటు పడిన ఆ అధికారి ఏడాది వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ చేయడం, లేని వారసులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఇతరులకు కట్టుబెట్టిన భారీగా దండుకున్నట్లు తెలిసింది. 

నగరంలోని కంఠేశ్వర్‌ ఏరియాలో గల సర్వే నెం.268లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం స్థలాన్ని కేవలం 110 గజాలుగా చూపి ఇటీవల వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. విచిత్రమేమిమంటే ఈ భూమి యజమాని బంటు ఎర్రన్న 1973లో చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు 2004లోనే డెత్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నారు. అయితే కొంత మంది అక్రమార్కులు కలిసి 2.11 ఎకరాల భూమిని కాజేయాలని ప్లాన్‌ చేశారు. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై బంటు ఎర్రన్న తన భూమిని ఇతరులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. అయితే, 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎర్రన్న గత సెప్టెంబర్‌ 3న తన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

విచారణలో నిగ్గుతేలేనా..? 
సస్పెండైన ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌ ఎదుట అయామక చక్రవర్తిగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తన సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తనను కాపాడతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top