నిర్మాణాల ఆయుష్షు పెంచుతుంది! 

IIT Hyderabad Technique To Gift New Lease Of Life For Aging Bridges Buildings - Sakshi

హైబ్రిడ్‌ ఫైబర్‌ రీ–ఇన్‌ఫోర్స్‌డ్‌ పాలిమర్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్‌ 

వంతెనలు, భవనాలు, ఇతర నిర్మాణాల మన్నిక పెంచేందుకు తోడ్పాటు 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు మరింత కాలం దృఢంగా ఉండేందుకు తోడ్పడే ప్రత్యేక మెటీరియల్‌ను హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. పాత నిర్మాణాలను బలోపేతం చేయడం కోసం స్టీలు, కాంక్రీట్‌కు బదులుగా.. తాము రూపొందించిన ‘హైబ్రిడ్‌ ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ పాలిమర్‌ (ఎఫ్‌ఆర్‌పీ)’ను వినియోగించవచ్చని ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్‌ తెలిపారు.

స్టీల్‌ప్లేట్లు, కాంక్రీట్‌ కంటే ఎఫ్‌ఆర్‌పీ దృఢత్వం, సామర్థ్యం ఎక్కువ అని ఐఐటీలోని క్యాస్ట్‌కాన్‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ‘పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న కొద్దీ దృఢత్వాన్ని కోల్పోతుంటాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్లు వంటివాటితో నిర్మాణాలు దెబ్బతింటాయి.

చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే, రోడ్డు వంతెనలు బలహీనమవుతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. కానీ ఎఫ్‌ఆర్‌పీని వినియోగించి మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేయడంతో ఆ నిర్మాణాల దృఢత్వాన్ని పెంచవచ్చు. వాటి ఆయుష్షును కూడా మరో 20 ఏళ్లవరకు పొడిగించవచ్చు. ఎఫ్‌ఆర్‌పీని వినియోగించడం వల్ల ఆయా నిర్మాణాల పరిమాణంలో మార్పులు ఉండవు. బరువు కూడా తక్కువగా ఉంటుంది’’అని సూర్యప్రకాశ్‌ వెల్లడించారు.  

దేశ అభివృద్ధికి ఊతం 
ఎఫ్‌ఆర్‌పీని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్‌ నేతృత్వంలోని పరిశోధన బృందాన్ని ఐఐటీ హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి అభినందించారు. ఈ పరిశోధన దేశంలో మౌలిక సదుపాయాలకు దీర్ఘాయువును ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల పరిరక్షణ, వాటి జీవితకాలాన్ని పెంచడం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top