వామ్మో.. ఇదేం పిడుగుల వాన! | Hyderabad Witness Heavy Rain With Thunderstorms Oct 2022 | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన.. మునుపెన్నడూ లేనంత పిడుగుల హోరుతో దద్దరిల్లిన నగరం

Oct 13 2022 7:12 AM | Updated on Oct 13 2022 10:18 AM

Hyderabad Witness Heavy Rain With Thunderstorms Oct 2022 - Sakshi

ఉరుములు.. పిడుగుల మోతతో నగరం దద్దరిల్లిపోయింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల జడివాన.. 

సాక్షి, హైదరాబాద్‌: సిటీని జడివాన కష్టాలు వీడడం లేదు. బుధవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఏకధాటి వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, హైటెక్‌ సిటీ, షేక్‌పేట్, ఆర్‌.సి పురం, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రాత్రి 11 గంటల వరకు బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  

హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత కురిసింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం హోరెత్తి పోయింది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా నీరు చేరింది. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది.

బుధవారం రాత్రి 11 గంటల సమయానికి.. 
బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు,
ఫిరోజ్‌గూడలో 9,
కుత్బుల్లాపూర్‌లో 8.7,
భగత్‌సింగ్‌నగర్‌లో 8.5,
ఆర్‌సీపురంలో 8.3,
తిరుమలగిరిలో 7.9,
నేరెడ్‌మెట్‌లో 7.7,
కూకట్‌పల్లిలో 7.4,
సికింద్రాబాద్‌లో 6.6,
బొల్లారంలో 5.7,
బేగంపేటలో 5.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

పాలమూరు అతలాకుతలం 
మహబూబ్‌నగర్‌:
జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టుప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. కొన్ని కాలనీల్లో మోకాళ్లలోతు వరకు నీరు రావడంతో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మహేశ్వరకాలనీ, శివశక్తినగర్, కుర్విహిణిశెట్టి కాలనీ, మధురానగర్, ప్రేమ్‌నగర్, బాయమ్మతోట, అరబ్‌గల్లీ, భవిత కళాశాల ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. న్యూటౌన్, తెలంగాణచౌరస్తా, రాయచూర్‌ రోడ్లపై నీరు పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భూత్పూర్‌ రోడ్డులో విద్యుత్‌ తీగలు తెగిపడడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దాదాపు గంటసేపు వర్షం కురవగా.. 7.9సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement