Traffic Restrictions: Flyovers In Hyderabad To Remain Closed On New Year's Eve - Sakshi
Sakshi News home page

బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్ల మూసివేత

Dec 31 2020 3:12 PM | Updated on Dec 31 2020 3:37 PM

Hyderabad Traffic Restrictions on New Year Eve - Sakshi

ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు.

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు.   

  • ట్యాంక్‌ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10  నుంచి
  • శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్‌ కాంపౌండ్‌ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు.
  • వీవీ స్టాట్యూ నుంచి – నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్‌ మీదుగా మళ్లిస్తారు.
  • బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్‌ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్‌  వైపు పంపిస్తారు. 
  • లిబర్టీ జంక్షన్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా మళ్లిస్తారు.
  • ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్‌ లైన్‌ మీదుగా పంపుతారు.
  • నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్‌ పైకి పంపించరు. వీటిని కర్బలా మైదాన్, మినిస్టర్స్‌ రోడ్‌ మీదుగా పంపిస్తారు.
  • సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్‌ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.
  • ఓఆర్‌ఆర్, పీవీ ఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మూసివేసి ఉంటాయి.    
  • ఎయిపోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు ఉంటుంది.

కనిపించని సందడి...
నగరంలో ఈసారి న్యూ ఇయర్‌ సందడి కనిపించట్లేదు. సిటీతో పాటు శివార్లలోనూ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్స్‌ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లకు సంబంధించి హోర్డింగ్స్‌ వెలుస్తాయి. ఇతర మాధ్యమాల ద్వారానూ భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈసారి ఎలాంటి హడావుడి కనిపించట్లేదు. అనేక రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకల్ని నిషేధించాయి. దీనికి తోడు డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాజధానిలో ఇలాంటి ప్రకటనలు లేనప్పటికీ అదే పరిస్థితి ఉండనుంది. (చదవండి: ఇంట్లోనే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement