
హైదరాబాద్ నగర వాసులకు ఇవాళ నరకం కనిపించింది. బిజీ రూట్లలో ఆర్టీసీ బస్సులు లేక.. కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. విద్యా సంస్థలు, పనులకు, ఆఫీసులకు సమయం అవుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలనూ అనుసరించారు మరికొందరు. ఈ క్రమంలో బాగా ఇబ్బందులు పడ్డారు.
నగరంలో ఇవాళ ‘రాజకీయ’ పర్యటనల నేపథ్యంలో హడావిడి నెలకొంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నగరంలో పర్యటిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ నగరానికి రానున్నారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో ఉండడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి.

దీంతో.. నగరంలో ఎటు చూసినా రాజకీయ కోలాహలం నెలకొంది. అందుకు తగ్గట్లే పోలీసుల మోహరింపు కనిపించింది. నేతల రాకపోకల నేపథ్యంలో వాహనదారులూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు.. పలు చోట్ల ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి పలు రూట్లలో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతూ వస్తోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. బిజీ ఫ్లైఓవర్లపై కూడా తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో.. సాయంత్రం పరిస్థితి ఇంతకు మించే ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు.