breaking news
People Strugglings
-
HYD: నగరంలో ఇవాళ నరకం!
హైదరాబాద్ నగర వాసులకు ఇవాళ నరకం కనిపించింది. బిజీ రూట్లలో ఆర్టీసీ బస్సులు లేక.. కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. విద్యా సంస్థలు, పనులకు, ఆఫీసులకు సమయం అవుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలనూ అనుసరించారు మరికొందరు. ఈ క్రమంలో బాగా ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఇవాళ ‘రాజకీయ’ పర్యటనల నేపథ్యంలో హడావిడి నెలకొంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నగరంలో పర్యటిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ నగరానికి రానున్నారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. దీంతో.. నగరంలో ఎటు చూసినా రాజకీయ కోలాహలం నెలకొంది. అందుకు తగ్గట్లే పోలీసుల మోహరింపు కనిపించింది. నేతల రాకపోకల నేపథ్యంలో వాహనదారులూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు.. పలు చోట్ల ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి పలు రూట్లలో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతూ వస్తోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. బిజీ ఫ్లైఓవర్లపై కూడా తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో.. సాయంత్రం పరిస్థితి ఇంతకు మించే ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు. -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఒక శిబిరం.. ఎన్నో కన్నీళ్లు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్‌కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్‌కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్‌లీలా ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమ్మా ఎప్పుడొస్తావ్! ‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్ఫోన్లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. అలా తినాలంటే ఎలా? తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.నా ఖమ్మం కోసం నేను!వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్‌లు.. కలెక్టర్ వినూత్న ఆలోచనఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు. -
పల్లె, పట్నం పరేషాన్
- 36 రోజులైనా తీరని కరెన్సీ కష్టాలు - బ్యాంకుల్లో ఇవ్వరు.. ఏటీఎంల్లో రావు - రూ.2,000 నోటు దక్కినా చిల్లర కోసం నానా తిప్పలు - గ్రామాల్లో చితికిపోతున్న చిన్న వ్యాపారాలు - చేతిలో చిల్లిగవ్వ లేక రైతుల అవస్థలు.. పెట్టుబడి లేక సాగుకు దూరం - జనంలో నశిస్తున్న సహనం.. పలుచోట్ల ధర్నాలు, ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: ఏటీఎం ముందు గంటలకొద్దీ నిలుచున్నా.... బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి చక్కర్లు కొట్టినా కొత్త నోటు దక్కడం లేదు. అడపాదడపా రూ.2 వేల నోట్లు లభిస్తున్నా వాటికి చిల్లర ఇచ్చే నాథుడే లేడు. పల్లె నుంచి పట్టణం దాకా సగటు జీవి గోస ఇది! పెద్దనోట్లు రద్దు చేసి 36 రోజులు కావస్తున్నా కరెన్సీ కష్టాలు తీరలేదు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రూ.2 వేలు, రూ.500 నోట్లు క్షేత్రస్థాయిలో అవసరమైనంత మేర అందడం లేదు. అసలు రూ.500 నోటును చూడనేలేదని గ్రామీణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అటు కరెన్సీ దెబ్బకు సాగు కూడా సందిగ్ధంలో పడింది. కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వేతనజీవులు తమ కష్టార్జితాన్ని తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సామాన్యుల కష్టాలు తెలుసుకునేందుకు రాజధాని హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న మేడ్చల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ‘సాక్షి’పర్యటించింది. అన్ని చోట్ల సామాన్యులు నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడి లేక రైతులు, వ్యాపారం లేక చిల్లర వర్తకులు, ప్రయాణికులు లేక చిన్న ప్యాసింజర్ వాహనాలు నడుపుకునేవారు ఉపాధి కోల్పోయారు. ఇక కాయగూరలు, పండ్ల బండ్ల వ్యాపారులకు పస్తులే దిక్కవుతున్నాయి. కుప్పకూలిన వ్యాపారాలు పెద్దనోట్ల రద్దుతో గ్రామాలు, పట్టణాల్లో చిల్లర వర్తక రంగం కుప్పకూలింది. రోజువారీ క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. కిరాణా, కూరగాయలు వ్యాపారుల గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. విక్రయాలు దెబ్బతినడంతో సరుకులు దుకాణాలకే పరిమితమవుతున్నాయి. ఈ వ్యాపారంలో వస్తున్న నష్టం ప్రభావం హోల్‌సేల్ విక్రేతలపైనా పడుతోంది. కొందరు వ్యాపారులు కస్టమర్లకు అరువుపై సరుకులు పంపిణీ చేస్తున్నా. కొనుగోలుదారుల నుంచి సకాలంలో డబ్బులు చేతికందడం లేదు. దీంతో చిల్లర వ్యాపారుల పెట్టుబడులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూరగాయల వ్యాపారులు కూడా ఇవే కష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతన్నకు ఎంత కష్టం..? నోటు పోటుకు వ్యవసాయ రంగం విలవిల్లాడుతోంది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు బ్యాంకులు రుణాలిస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలివ్వలేమని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి. అక్కడక్కడ రుణం ఇచ్చినా ఆంక్షల కారణంగా బ్యాంకు ఖాతా నుంచి నగదు చేతికి అందని పరిస్థితి నెలకొంది. దీంతో రబీ సాగు గందరగోళంలో పడింది. పంట దిగుబడులు మార్కెట్‌కు తరలించే రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. పంట కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు చెక్కులు, ఆన్లైన్ పద్ధతిలో చేస్తున్నారు. సొమ్ము బ్యాంకు ఖాతాలో జమకావడంతో రైతుల చేతికి చిల్లిగవ్వ అందడం లేదు. పొలంలో పనిచేసే కూలీలకు, దుక్కులు దున్నిన ట్రాక్టర్ డ్రైవర్లకు దినసరి కూలీలు ఇవ్వడం కష్టంగా మారింది. చిల్లర ఇవ్వడం కష్టంగా ఉంది: దాచేపల్లి దర్శన్, కిరాణా దుకాణం యజమాని, కందుకూరు, రంగారెడ్డి జిల్లా మార్కెట్లో చిల్లర సమస్య తీవ్రంగా ఉంది. దుకాణానికి వచ్చే కస్టమర్లంతా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. వారికి చిల్లర ఇవ్వడం కష్టంగా మారింది. రెగ్యులర్‌గా వచ్చే వారికి కొంతవరకు ఉద్దెర ఇస్తున్నాం. కానీ అందరికీ ఇస్తే రోటేషన్ జరగదు. నెల నుంచి వ్యాపారం సగానికిపైగా పడిపోయింది. సరుకంతా కుల్లిపోతోంది.:ఎడ్ల లక్ష్మమ్మ, కూరగాయల విక్రేత, మర్రిగూడెం, నల్లగొండ జిల్లా నేను రెండుమూడ్రోజులకోసారి సాగర్ హైవే దగ్గర ఉన్న మార్కెట్‌కు వెళ్లి రూ.2 వేల వరకు కూరగాయలు తీసుకొస్తా. వాటిని రెండ్రోజుల్లో విక్రయిస్తా. కానీ నెలరోజులుగా వ్యాపారం జరగడం లేదు. చాలామంది రూ.2 వేల నోటుతో కూరగాయలు కొనడానికి వస్తున్నారు. వారికి చిల్లర ఇవ్వడం నాకు సాధ్యం కాదు. కూరగాయలు అమ్ముడు కాకపోవడంతో కుళ్లిపోతున్నాయి. నెల రోజులుగా నష్టాలే వస్తున్నాయి. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా: అయ్యవారి వెంకట్‌రెడ్డి, గండేడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా పంట అమ్మితే రూ.60 వేలు బ్యాంకులో జమ చేశారు. పంటకోతకు కూలీలు, వరికోత మిషన్‌తో పాటు చిల్లర ఖర్చులు బాగానే అయ్యాయి. ఇప్పుడు బ్యాంకులో నగదు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వారం క్రితం బ్యాంకుకెళితే రూ.4 వేలు ఇచ్చారు. అవికూడా రెండు రూ.2 వేల నోట్లు. పైసల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. డబ్బులందితేనే పొలం పనులు:అలియాబాద్, శామీర్‌పేట్ మండలం, మేడ్చల్ జిల్లా ఖరీఫ్ సీజన్లో జొన్నలు, వడ్లు అమ్మితే నా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారు. కానీ అవి నా చేతికి వస్తలేవు. ఇప్పుడు దక్కులు దున్ని సిద్ధంగా ఉన్నా. డబ్బులందితే పొలం పనులు.. లేకుంటే బంద్. ఉద్దెర పెరుగుతోంది: సత్యనారాయణ, టీస్టాల్, ఇబ్రహీంపట్నం నేను ఇంతకుముందు రోజుకు 15 లీటర్ల పాలతో చాయ్ విక్రయించేవాడిని. ఇప్పుడు 4 లీటర్లు కూడా దాటడం లేదు. చిల్లర లేకపోవడంతో అంతా ఉద్దెర గిరాకీ పెరుగుతోంది. మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాల్లో నేను రెగ్యులర్‌గా చాయ్ పోస్తా. కానీ వాళ్లు కూడా చిల్లర లేదని నెలరోజులుగా పైసలు ఇవ్వలేదు. కొత్త నోట్లు డిపాజిట్ కావడం లేదు...:క్రిష్ణకుమారి, మేనేజర్, ఇండియన్ బ్యాంక్, మేడిపల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం ఖాతాదారులంతా పాత రూ.500, రూ.1000 నోట్లనే డిపాజిట్ చేస్తున్నారు. కొత్తనోట్లు డిపాజిట్ కావడం లేదు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి కొంత నగదును ప్రతి రోజు బ్యాంకుకు తీసుకొస్తున్నాం. కానీ ఆ మొత్తం సరిపోవడం లేదు. బ్యాంకు తెరిచిన గంటలోపే నగదు నిండుకుంటోంది. ఖాతాదారుల ధర్నా నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో నగదు లేక ఖాతాదాలు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచే బ్యాంకు వద్ద ఖాతాదారులు బారులుదీరారు. తీరా బ్యాంకు తెరిచే సమయానికి డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహంతో సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా నిర్వహించారు. నగదు కోసం తోపులాట.. వృద్ధురాలికి గాయాలు అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ఆంధ్రాబ్యాంక్ వద్ద నగదు కోసం ఖాతాదారులు బారులుదీరారు. ఈ క్రమంలో క్యూలో తోపులాట జరిగి లోపలికి వెళ్లే ద్వారం వద్ద అద్దం పగిలి బీజీ కొత్తూరు గ్రామానికి చెందిన నాగుల పొట్టెమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలి తలకు, కన్ను కింది భాగంలో గాయాలయ్యాయి. ఆమెతో ఎవరూ లేకపోవడంతో బ్యాంక్ సిబ్బందే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రసవ వేదన.. టేకులపల్లి: కల్యాణి నిండు గర్భవతి. వైద్యులు డెలివరీ తేదీని ఖరారు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆమె భర్త ఇస్లావత్ ఈరు.. బుధవారం తెల్లవారుజామున 6 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ఎస్బీహెచ్ వద్దకు వచ్చి క్యూలో నిల్చున్నాడు. ఉదయం 11 గంటలకు ఆయన భార్య కల్యాణి భోజనం తీసుకుని వచ్చింది. ఆకలితో ఉన్న ఈరు లైను వద్దే భోజనం చేశాడు. తర్వాత బ్యాంకులో డబ్బులు తీసుకుని వైద్య పరీక్షల కోసం భార్యను తీసుకుని ఖమ్మం వెళ్లాడు. జమ్మికుంటలో తోపులాట.. గేటుకు తాళం జమ్మికుంట: జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంకుకు బుధవారం జనం పెద్ద ఎత్తున వచ్చారు. కొందరిని లోపలికి పంపించిన బ్యాంకు సిబ్బంది.. తర్వాత గేటుకు తాళం వేశారు. లోపలికి వెళ్లిన వారు బయటకు వచ్చేందుకు గంటన్నరపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. నగదు కోసం బయట నాలుగు గంటలు, డబ్బులు తీసుకున్న తర్వాత గంటన్నర లోపల ఉండాలా అంటూ ఖాతాదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గేటు తీయడంతో బయట క్యూ కట్టిన వారు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏటీఎం వద్ద తోపులాట.. ఒకరికి గాయాలు పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్బీహెచ్ ఏటీఎం వద్ద బుధవారం తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఏటీఎం తెరుస్తున్న క్రమంలో ఖాతాదారులంతా ఎగబడ్డారు. ఓ వ్యక్తి ఏటీఎం డోర్ అద్దాలపై పడ్డాడు. ఆయనపై మరి కొంతమంది పడడంతో అద్దాలు పగిలి ఆ వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. రొక్కం కోసం రోడ్డెక్కారు ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట బుధవారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో డబ్బు ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ బ్యాంకు ఖాతాదారుల్లో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. నాట్లు వేసే సమయం కావడంతో పెట్టుబడుల కోసం డబ్బు కావాలని బ్యాంకుకు వచ్చారు. అయితే నగదు లేకపోవడంతో ఆగ్రహించిన ఖాతాదారులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. ధర్పల్లి మండలంలోనూ ఖాతాదారులు ఎస్బీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా పెద్ద నోట్ల రద్దుతో పేదలు, కార్మికులే ఇబ్బందులు పడుతున్నారని, ఏటీఎం సెంటర్లలో వంద నోట్లు ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లోని కార్మికుల కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కోరారు. ఖాతాదారుల ధర్నా నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో నగదు లేక ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచే బ్యాంకు వద్ద ఖాతాదారులు బారులుదీరారు. తీరా బ్యాంకు తెరిచే సమయానికి డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహంతో సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా నిర్వహించారు.