జూబ్లీహిల్స్‌లో మరో వంతెన 

Hyderabad: New Flyover Will Construct In Jubilee Hills - Sakshi

మరో వారం రోజుల్లో అందుబాటులోకి    

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్‌ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, షేక్‌పేట వైపు వెళ్లేవారికి ఇప్పుడున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45, రోడ్‌ నెం.78, ఫిలింనగర్‌ కొత్త చెరువు రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ రోడ్లపై భారీగా వాహనాలు తరలి వెళ్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులు జూబ్లీహిల్స్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులకు మరో అనువైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.51లో ఈ వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.  

షేక్‌పేట మల్కంచెరువు వద్ద షేక్‌పేట ఫ్లైఓవర్‌ కింద జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.51 ఈ బ్రిడ్జి రోడ్డును అనుసంధానం చేస్తున్నారు.  
లెదర్‌ పార్కు రోడ్డు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45కు కనెక్ట్‌ చేస్తున్న ఈ రహదారి వంతెన నిర్మాణానికి రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  
290 మీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటున్న ఈ బ్రిడ్జిపై నాలుగు లైన్ల బై డైరెక్షనల్‌ రోడ్డును నిర్మించడం జరుగుతున్నది.  
ప్రస్తుతం షేక్‌పేట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45కు విస్పర్‌వ్యాలీ మహాప్రస్థానం మీదుగా రావాల్సి ఉండేది. ఇది ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పుడు కొత్తగా వేస్తున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.51 లింకు రోడ్డుతో ఈ దూరం 3.5 కిలోమీటర్లకు తగ్గనుంది.  
మరో వారం, పది రోజుల్లో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top