Cash Loading: ఏటీఎంలు ‘నింపడం’లో అంతులేని నిర్లక్ష్యం 

Hyderabad: Negligence In Filling Up Money In ATMs - Sakshi

నగదు నిర్వహణలోనూ ఎన్నో లోపాలు

ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో రూ.కోట్ల నగదు

అనువుగా మార్చుకుంటున్న కస్టోడియన్లు

సెక్యూరిటీ గార్డులు సైతం ఎంతో ‘వీక్‌’

తరలింపులో గన్‌మెన్లుగా వృద్ధుల ఏర్పాటు

సాక్షి,హైదరాబాద్‌: ఏటీఎంలో నింపే డబ్బు బ్యాంకులది.. అంటే ప్రజల సొమ్ము. నిర్వహణలో మాత్రం అటు బ్యాంకులు, ఇటు కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా లోపభూయిష్టంగా మారిన ఏటీఎంలు అక్రమార్కులకు, నేరగాళ్లకు కల్పతరువులుగా మారుతున్నాయి. నగరంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలే దీనికి నిదర్శనం. కస్టోడియన్లు రూ.14.69 కోట్లు కాజేసిన కేసులు గడిచిన కొన్నేళ్లల్లో సిటీలో నమోదయ్యాయి.  రైటర్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగులు రూ.23.32 లక్షలు కాజేశారంటూ ఇటీవల సీసీఎస్‌ పోలీసులు రిజిస్టర్‌ చేసిన కేసు వీటిలో తాజాది.  

ఔట్‌ సోర్సింగ్‌ చేతుల్లో నగదు భర్తీ.. 
ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతల్ని స్వయంగా పర్యవేక్షించట్లేదు. ఈ కాంట్రాక్టుల్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా నడిచే ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన నగదు భద్రపరిచే కేంద్రాల నుంచి రూ.కోట్లను తమ సంస్థల వాహనాల్లో తరలించే టీమ్‌ సభ్యులకు ఈ కస్టోడియన్లు నేతృత్వం వహిస్తారు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో పెడుతుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు కాంట్రాక్టు ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థకు అప్పగిస్తున్నాయి.  

సాంకేతికతకు ఆమడదూరం... 
ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్‌ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్‌ చేస్తే కంప్యూటర్‌లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్‌లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని డిపాజిట్‌ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు.  

ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్‌ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్‌ చేశామంటూ చెబుతున్న కస్టోడియన్లు గోల్‌మాల్‌కు పాల్పడుతూ రూ.లక్షలు, రూ.కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి.   

ఓల్డేజ్‌ సెక్యూరిటీ గార్డ్‌లు..  
ఏటీఎంల భద్రత విషయంలోనూ లోపాలున్నాయి. ఇక్కడ విధుల్లో  వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్క్‌ వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌ 29న చోటు చేసుకున్న ఏటీఎం సొమ్ము దోపిడీ కేసు దీనికి ఉదాహరణ. దాదాపు ప్రతి సెక్యూరిటీ గార్డు, గన్‌మె న్‌ ‘ఓల్డేజ్‌’లోనే ఉంటున్నారు. పది ఏటీఎం కేంద్రాలను పరిశీలిస్తే వాటిలో ఆరు ఏడింటిలో వృద్ధులే సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదును కాజేసిన కస్టోడియన్ల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నగరంలో రూ.14.69 కోట్ల  మేర కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకులు మాత్రం పట్టించుకోవట్లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top