రాత్రి 9.30 దాటితే మెట్రో బంద్‌, మరి ఎలా?

Hyderabad Metro Rail Service Not Change Its Timings After Lockdown - Sakshi

అన్ని రంగాలు గాడిన పడినా మారని మెట్రోరైల్‌ సమయాలు 

ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకే సేవలు 

అర్ధరాత్రి వరకు సర్వీసులు నడపాలంటున్న నగరవాసులు   

రెండు లక్షల మార్కు దాటని ప్రయాణికులు

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫికర్‌ నుంచి గ్రేటర్‌ వాసులకు విముక్తి కల్పించేందుకు పట్టాలెక్కిన మెట్రో రైలు వేళలు పొడిగించకపోవడం నగరవాసులకు శాపంగా పరిణమించింది. ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. చివరి రైలు గమ్యస్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది.

కానీ గ్రేటర్‌లో అదే సమయంలో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకొని రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈనేపథ్యంలో మెట్రో రైలు సరీ్వసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌ కలకలకం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో రైళ్ల వేళలు పొడిగించడం అనివార్యమని ప్రజారవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 

నాడు నాలుగు..నేడు రెండు లక్షలే.... 
నగరంలో మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో రైలు సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్లలో గతేడాది మార్చికి ముందు (లాక్‌డౌన్‌కు)నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు. సెలవులు, ఇతర పర్వదినాల సందర్భంగా రద్దీ మరో 50 వేల మేర పెరిగేది. కానీ ప్రస్తుతం మూడు రూట్లలో కేవలం 2 లక్షల మంది మాత్రమే మెట్రోను వాడుతున్నారు. ఇటీవల ఎండల తీవ్రత స్వల్పంగా పెరగడంతో రద్దీ 5 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.

కాగా ఐటీ కారిడార్‌లో వందలాది ఐటీ, బీపీఓ, కేవీపీ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబరు వరకు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతించడంతో మెట్రో రద్దీ అనూహ్యంగా పడిపోయిన విషయం విదితమే. మరోవైపు మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ బాదుడు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి ప్రయాణీకులు జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మెట్రోకు అనుకున్న స్థాయిలో ఆదరణ పెరగకపోవడం 
గమనార్హం. 

నాటి అంచనా 16 లక్షలు..? 
మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం రూట్లలో మెట్రో ప్రయాణీకుల సంఖ్య సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కానీ నిర్మాణ సంస్థ అంచనాలు లెక్క తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం లాక్‌డౌన్‌ కంటే ముందు స్థితి..అంటే 4 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.  

కింకర్తవ్యం 

  • మూడు మార్గాల్లో మెట్రో సర్వీసుల వేళలను ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలి. 
  • గతంలో ప్రకటించినట్లుగా టిక్కెట్లు, స్మార్ట్‌కార్డులపై రాయితీని అమలు చేయాలి. 
  • అన్ని స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. 
  • స్టేషన్ల నుంచి సమీప కాలనీలు,బస్తీలకు ఆర్టీసీ మినీ బస్సులను విరివిగా నడపాలి.  
  • అన్ని స్టేషన్లలో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top