హైదరాబాద్‌లో ఐటీ బూమ్‌.. నూతన పాలసీతో జోష్‌

Hyderabad IT Jobs: Pharma, Telecommunications Jobs, Teamlease Survey - Sakshi

31 శాతం నూతన ఉద్యోగాల సృష్టి

ఫార్మా రంగంలో 25 శాతం కొలువులు

టీం లీజ్‌ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్‌ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది.  

► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. 

► ఇక దేశంలో బల్క్‌డ్రగ్‌ క్యాపిటల్‌గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట.
 
► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్‌రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. 


బల్క్‌డ్రగ్‌ రంగంలోనూ... 

మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్‌ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్‌ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. 


నూతన పాలసీతో జోష్‌

రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్‌వేర్‌ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్‌స్పీడ్‌తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం.

తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ 2021–26 మధ్య కాలానికి  ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్‌ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా  ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో  సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్‌ కంపెనీల్లో సుమారు 6.25  లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్‌ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్‌ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top