
బత్తిని కుటుంబ సభ్యులకు పద్మశ్రీ అవార్డుకు కృషి : మంత్రి పొన్నం
పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన ఆస్తమా రోగులు
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: చేప ప్రసాదం పంపిణీతో హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వ్యాప్తి చెందిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బత్తిని కుటుంబీకులు ఏటా లక్షలాది మందికి ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాద కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్, రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కీలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలామంది నమ్మకమన్నారు. విశ్వాసానికి మరో పేరు చేప ప్రసాదం పంపిణీ అన్నారు. ప్రభుత్వ పక్షాన 15 రోజులుగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి వివిధ శాఖల అధికారులు కలిసి 48 గంటల పాటు పనిచేస్తున్నట్టు వెల్లడించారు.
178 సంవత్సరాలుగా లక్షలాది మందికి సేవాభావంతో సేవలందిస్తున్న బత్తిని కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ 1995 నుంచి చేపప్రసాదాన్ని తన కుటుంబం తీసుకుంటుందని, తమకు ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు.
మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ తరఫున 1.50 లక్షల చేపపిల్లలను అందించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎగ్జిబిషన్ సొసైటీ, ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించాయన్నారు.కర్ణాటక ఎమ్మెల్సీ మంజునాథ్, స్థానిక కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
46 వేల చేపపిల్లల విక్రయాలు
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి వరకు 46 వేల చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో విక్రయించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం వరకు 60 వేల వరకు విక్రయాలు జరగొచ్చన్నారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి
మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ(75) చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చాడు. క్యూ లైన్లో నిలబడిన సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. తక్షణమే ఆయన్ను ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసినా, ఫలితం లేకపోయింది. సత్యనారాయణ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
నేపాల్ నుంచి రాక..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ నుంచి కూడా చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చారు. ఆ దేశానికి చెందిన గోఖులు కాత్రే కుటుంబ సభ్యులు చేపప్రసాదాన్ని తీసుకున్నారు. మూడేళ్లు గా తాము క్రమంగా తప్పకుండా వస్తున్నామని చెప్పారు.
భారీ బందోబస్తు
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర పోలీస్ జాయింట్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, సెంట్రల్‌జోన్ డీసీపీ శిల్పవల్లితో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు. అడిషనల్ డీసీపీ ఆనంద్, అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు భరత్‌కుమార్, ఏడుకొండలుతో పాటు అదనపు పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి.